Telangana CM Revanth Reddy Chit Chat : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు (Musi Revival Project Works Begins)పై ముందడుగే కానీ, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందే వెయ్యి సార్లు ఆలోచిస్తామని, నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నవంబర్ 1న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామన్న సీఎం.. బాపూఘాట్ నుంచి పనులు స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఇష్టాగోష్టిగా ఆయన మాట్లాడారు.
అభ్యంతరాలను తెలియజేయవచ్చు : ఈ సందర్భంగా నవంబర్‌లోపు మూసీ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకూ సిద్ధమని సవాల్ విసిరారు. మూసీ పునరుజ్జీవంపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్న ఆయన, బీఆర్‌ఎస్ వాళ్లు తమ అభ్యంతరాలను తెలియజేయాలని అన్నారు. తనను కలవటం అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి అభ్యంతరాలు చెప్పొచ్చని, విపక్షాలు ప్రతిపాదనలు సూచించవచ్చని స్పష్టం చేశారు.
కొందరి మెదళ్లలో మూసీ మురికి కంటే ఎక్కువ విషం - అందుకే దుష్ప్రచారం: రేవంత్‌రెడ్డి
నా కల నెరవేరింది : ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కొనసాగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు చెప్పారు. విచారణ విషయంలో కక్షసాధింపు ఉండదని, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరతామని అన్నారు. ఈ క్రమంలోనే సీఎం అవ్వాలనుకున్న తన కల నెరవేరిందన్న రేవంత్ రెడ్డి, ఈ పదవి కంటే పెద్ద కలలు తనకు వేరే ఏమీ లేవని అన్నారు.