రెండోరోజూ కొనసాగిన ఉపాధ్యాయుల ఆందోళన - అప్రెంటీస్ విధానంపై ఆగ్రహం Teachers Protests Across the State:ప్రతిపక్షనేతగా పాదయాత్ర సమయంలో అనేక హామీలిచ్చిన జగన్ సీఎం అయ్యాక పూర్తిగా మరిచారని ఉపాధ్యాయులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగాయి. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కర్నూలులో ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. రాష్ట్రంలో 40 వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6 వేల ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు అభద్రతా భావం నెలకొందని అన్నారు.
గొంతెమ్మ కోరికలు కోరడం లేదు - దాచుకున్న సొమ్ము ఇవ్వాలని అడుగుతున్నాం: ప్రభుత్వ ఉపాధ్యాయులు
Nandyala District:నంద్యాలలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన కొనసాగించారు. ప్రతినెలా ఒకటో తేదీ జీతాలు ఇవ్వాలని, ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Prakasam District:ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్, ఏపీటీఎఫ్ నాయకులు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జీతాలు ఒకటో తేదీనే ఇవ్వాలని, పట్టణాలలో జనాభా పెరిగినందున ఇంకా పాఠశాలలు ఏర్పాటు చేయాలని, సర్వీసు రూల్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూస్తే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం : యూటీఎఫ్
Guntur District:డీఏ, పీఎఫ్ బకాయిలు సహా ఇతర సమస్యల్ని వెంటనే పరిష్కరించాలంటూ గుంటూరులో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఖరితో మున్సిపల్ పాఠశాల టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. 117 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు చెల్లించడం లేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Kakinada District:ఉపాధ్యాయులు దాచుకున్న పీఎఫ్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుంటోందని ఉపాధ్యాయులు ఆరోపించారు. కాకినాడ ధర్నాచౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. తమకు రావల్సిన పీఎఫ్ లోన్స్, సరెండర్ లీవ్స్, పీఆర్‌సీ, డీఏ అరియర్లు ఇతరత్రా బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
'మాట తప్పను - మడమ తిప్పను' మాటలు గుర్తున్నాయా సీఎం : యూటీఎఫ్ ఉపాధ్యాయులు
Vizianagaram District:పిల్లల పెళ్లిళ్లకు రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే, వారి పిల్లల బారసాలకు కూడా మంజూరు కావడం లేదని విజయనగరంలో ఉపాధ్యాయులు ఆవేదన చెందారు. ప్రభుత్వం 18 వేల కోట్ల బకాయిలు విడుదల చేయకుండా తాత్సారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Srikakulam District:పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని 30 శాతం ఐఆర్‌తో పాటు 12వ పీఆర్సీ విధివిధానాలకు వెంటనే రూపొందించాలని శ్రీకాకుళంలో ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. బదిలీలతో పాటు వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.