Tenth Class Exam Paper Pattern in Telangana : రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్షల ప్రశ్నపత్రాల స్వరూపంపై స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. కొత్త విధానం ఏంటన్నది తేలితేనే దానికి అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయవచ్చని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే ఎగ్జామ్స్‌ను కూడా అదే పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుందని, అందుకే ప్రభుత్వం త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) సైతం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం గమనార్హం.
రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరం వరకు హిందీకి తప్ప మిగిలిన ఐదు సబ్జెక్టులైన తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌కు రెండు పేపర్లు ఉండేవి. అంటే మొత్తం 11 పేపర్లు. దీని వల్ల పరీక్షల నిర్వహణ ఆలస్యమవుతుందని, విద్యార్థులు సైతం ఒత్తిడికి గురువుతున్నారని భావించిన రాష్ట్ర సర్కార్, రెండు పేపర్ల విధానాన్ని రద్దు చేసింది. ఆ స్థానంలో ఒక్కో సబ్జెక్టుకు ఒక పేపరు, అంటే మొత్తం ఆరు పేపర్ల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మ్యాథ్స్, సైన్స్, సోషల్‌లో ప్రశ్నల సంఖ్యను, ఛాయిస్ విధానాన్ని మార్చింది. అయితే ఈ మార్పు 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు మాత్రమే వర్తిస్తుందని 2023 జనవరి 11న విద్యాశాఖ జీవో జారీ చేసింది. అంటే గత ఏడాదితో ప్రశ్నల సంఖ్య, ఆ ఛాయిస్ విధానం ముగిసిపోయింది.