AP TET Notification Release on July 1st : ఏపీలో సోమవారం నాడు (జులై 1)న టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి జులై 2 నుంచి దరఖాస్తుల స్వీకరిస్తామని తెలిపింది. నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, షెడ్యూల్, సిలబస్‌తో పాటు ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షపై అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలను ఖరారు చేసినట్లు పేర్కొంది.
Andhra Pradesh TET Notification 2024 Updates :ఈ సమాచారాన్ని జులై 2 నుంచి https://cse.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అదనపు సమాచారం కోసం కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
ఇటీవల ఏపీలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వరకు గత ప్రభుత్వం టెట్‌ను నిర్వహించింది. ఈ పరీక్షకు 2.35లక్షల మంది హాజరైతే, వారిలో 1,37,903 మంది (58.46శాతం) అర్హత సాధించారు. అయితే, కొత్త ప్రభుత్వం పాత డీఎస్సీని రద్దు చేసి, కొత్తగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా బీఈడీ, డీఎడ్ పాసైన అభ్యర్థులతో పాటు ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఫెయిలైన వారికి అవకాశం కల్పిస్తూ కొత్తగా టెట్ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుంది. ఇందులో భాగంగా పేపర్-1 రాయాలంటే డీఈడీ అర్హత ఉండాలి. పేపర్-2 రాయాలంటే డిగ్రీ, బీఈడీ చదివి ఉండాలి.