TDP Minorities Meet in Parchur: రాష్ట్రంలోని ముస్లింల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, సీఎం జగన్ కనుసన్నల్లోనే ముస్లింలపై దాడులు పెరిగాయని శాసన మండలి మాజీ ఛైర్మన్ షేక్ షరీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పర్చూరులో టీడీపీ ముస్లిం మైనార్టీ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ వారికి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.
వైసీపీ పాలనలో దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని, ఓట్ల కోసం ఇప్పుడు ముస్లింలు తమ సోదరులంటూ ముఖ్యమంత్రి జగన్ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ అభ్యున్నతిని విస్మరించి మొండిచేయి చూపారని, టీడీపీ హయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ ఆపివేశారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి దగా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో 100 మందికిపైగా తమ వర్గీయులపై దాడులు, హత్యలు జరిగాయని, ఇందుకు వైసీపీ నాయకుల వేధింపులే కారణమని ఆరోపించారు.
సీఎం జగన్ తప్పుడు వ్యాఖ్యలతో టీడీపీకి ముస్లింలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముస్లింల కోసం టీడీపీ అనేక పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ పెడతానన్న జగన్ మోహన్ రెడ్డి, తీరా గెలిచిన తరువాత అయిదేళ్లుగా దాని గురించే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జగన్ హామీలు ఏవీ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.
మైనారిటీల నిధులను ప్రభుత్వం నవరత్నాలకు తరలిస్తోంది: ఎంఏ షరీఫ్