TDP Leaders Fires on YSRCP: పెన్షన్ పంపిణీ చేయకుండా తెలుగుదేశం అడ్డుపడుతుందంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ధ్వజమెత్తారు. ఈ మేరకు వైసీపీ నేతలు వలంటీర్లకు వాయిస్ మెసేజ్‍లు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీకి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేయడం వల్లే పెన్షన్ పంపిణీ నిలిపివేశారని ఇవాళ ఉదయాన్నే పెన్షన్ దారులకు ఈ సందేశం చెప్పాలని ఆదేశాలిచ్చారని మండిపడ్డారు.
మన అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్‍ను ఆపింది టీడీపీ నేతలే అని ప్రతి ఒక్క గడపకు వెళ్లి చెప్పాలని సందేశాలిచ్చారంటూ దుయ్యబట్టారు. రెండు నెలల్లో జగనన్న ప్రభుత్వంలో మళ్లీ ప్రతి నెలా ఘనంగా నిర్వహిస్తారని కూడా చెప్పాలని వాయిస్ మెసెజ్‌లు పంపారని విమర్శించారు. వైసీపీ విషప్రచారాన్ని సీరియస్‍గా తీసుకున్న కూటమి నేతలు, కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాలను వైసీపీ వక్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల కోసం ఇవ్వాల్సిన 2 వేల కోట్లను జగన్, బుగ్గన బిల్లుల రూపంలో అస్మదీయులకు చెల్లించారని ఆరోపించారు. ఖజానాలో డబ్బులు లేకుండా చేసి ఇప్పుడు తెలుగుదేశంపై అభాండాలు వేస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు.
Varla Ramaiah Comments on Volunteers: ఎన్ని దొడ్డి దారులు తొక్కైనా, దొంగ దారులు వెతుక్కొని అధికారంలోకి రావాలని జగన్ రెడ్డి చూస్తున్నాడని తెలుగుదేశం నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. పెన్షన్ పంపిణీలో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదని ఈసీ ఉత్తర్వులివ్వగానే జగన్‌కి ఒళ్లంతా జెర్రిలు పాకుతున్నట్లైందని దుయ్యబట్టారు. సోమవారం పెన్షన్ల పంపిణీ సజావుగా సాగాలని, ఏ ఒక్క పెన్షన్‌దారుడు కూడా ఇబ్బంది పడకుండా చూడాలని చంద్రబాబు సీఎస్‌కు, సీఈవో మీనాకు లేఖలు రాశారని గుర్తు చేశారు. వాలంటీర్ల వ్యవస్థకు తెలుగుదేశం వ్యతిరేకం కాదని వర్ల రామయ్య స్పష్టం చేశారు. వాలంటీర్లను జగన్ బానిసల్లాగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మెరుగైన రీతిలో వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటామన్నారు