TDP Leader Demand Action Those Violated Election Rules:ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామవరంలో మీడియా సమావేశం నిర్వహించిన నల్లమిల్లి సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను, ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. కానీ అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొప్పవరం గ్రామంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, సతీమణి ఆదిలక్ష్మి ఇద్దరూ వాలంటీర్లకు చీరలు పంచిపెట్టే కార్యక్రమం ఇటీవల నిర్వహించారన్నారు. దానికి వారు వేరే కార్యక్రమం పేరు పెట్టి పంచారని ఆయన విమర్శించారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీ ఆగ్రహం - పోలీస్ అధికారులపైనా చర్యలకు సమాయత్తం!
అనపర్తి ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి ఆదివారం రంగంపేట మండలం నల్లమిల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె ప్రచారంలో స్థానిక వాలంటీర్లు, సచివాలయానికి చెందిన వైద్య, ఇంజినీరింగు సిబ్బందితో పాటు ఆశ వర్కర్లు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. కొద్దిసేపటికి ఈ అంశం వైరల్ అవ్వడంతో వారు కనుమరుగయ్యారు. సచివాలయ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, యానిమేటర్లు, వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సంఘం నియమాల్ని ఉల్లంఘిస్తున్నారనటానికి ఇంతకన్నా ఉదాహరణ ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం ఏ విధంగా సమర్ధనీయమో అధికారులు ఆలోచించాలన్నారు. ఈ రెండు విషయాలపై ఎన్నికల కమీషనర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిబ్బందిపైన, రాజకీయ నాయకులపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తానన్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకుని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.