TDP Leader Bonda Uma Allegations on CS Jawahar Reddy Land Scams:సీఎం జగన్, ఆయన బంధువుల అండతో భోగాపురం మండలంలో సీఎస్ జవహర్ రెడ్డి 2 వేల కోట్ల రూపాయల విలువైన భూములు దోచేశారని తెలుగుదేశం నేత బొండా ఉమ ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేసినట్లు ఆధారాలున్నా సీఎస్ బుకాయిస్తున్నారని పైగా అక్రమాలు బయటపెట్టిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ దందాపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేయించి జవహర్ రెడ్డిని సీఎస్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
'పోలీసులమని మర్చిపోయారు'- తాడిపత్రి అల్లర్లలో ఏఆర్ అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ సీఐపై వేటు
ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం తీరుపై ప్రధాన ఎన్నికల అధికారికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని విమర్శించారు. సీఎస్ అక్రమాలపై దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు బోండా తెలిపారు. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున జరిగిన భూ దోపిడీలో సీఎస్ ప్రమేయంపై ఆధారాలున్నా జవహర్ రెడ్డి రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఫామ్ పట్టాలన్నింటినీ సీజ్ చేసి, కలెక్టర్ సహా, సంబంధిత అధికారులందరిపైనా విచారణ జరగాలన్నారు. ఆధారాలతో ఆరోపణలు చేస్తే విచారణ కోరకుండా, ఆరోపణలు చేసిన వారిని సీఎస్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్, ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తమ ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.