TDP COMPLAINT TO EC ON CS JAWAHAR REDDY: సీఎస్ జవహర్ రెడ్డిపై భూ దోపిడీ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. వెంటనే ఆయనను సీఎస్‌గా తొలిగించి, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరింది. అధికార వైఎస్సార్సీపీకి అనుకూలంగా సీఎస్ జవహర్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని లేఖలో పేర్కొంది. జవహర్ రెడ్డి సీఎస్‌గా ఉంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందా లేదా అనే అనుమానం అన్ని విపక్ష పార్టీలకు ఉందని తెలిపింది.
సీఎస్ భూముల కొనుగోలు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహిస్తూ, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించలేరని, గతంలో చేసిన ఫిర్యాదును గుర్తు చేసింది. జీవో 596కు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని ముందస్తుగా పొందడం, భూముల రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రభావితం చేయడం వంటి వివాదాల్లో చిక్కుకున్నారని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో సీఎస్‌గా జవహర్ రెడ్డి ఉంటే, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనపై ప్రభావితం చూపే ప్రమాదం ఉందంది.
వైఎస్సార్సీపీకి అనుకూలంగా నిర్ణయాలు, కోడ్ ఉల్లంఘనలు, అధికార పార్టీకి చెందిన వారి బిల్లులను చెల్లించడానికి నిధులు విడుదల చేసేలా సీఎస్ చర్యలు తీసుకున్నారని లేఖలో వివరించింది. ఇప్పటికే చాలాసార్లు ఆయన మీద ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించింది. ఈసీకి ప్రస్తుతం ఉన్న విస్తృత అధికారాలను ఉయోగించుకుని జవహర్ రెడ్డిని తొలగించి సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరింది.