TDP-Janasena First List for AP Elections-2024: తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల జాబితాలో వెనకబడిన వర్గాలకు పెద్దపీట వేశారు. 99 మంది అభ్యర్థుల్లో 18మంది బీసీలు ఉన్నారు. ఇఛ్చాపురం, టెక్కలి, అమదాలవలస, గజపతినగరం, విశాఖ పశ్చిమం, నర్సీపట్నం, తుని, రాజమహేంద్రవరం సిటీ, ఆచంట, నూజివీడు,పెడన, మచిలీపట్నం, రేపల్లె, మైదుకూరు, పత్తికొండ, రాయదుర్గం,పెనుకొండ, అనకాపల్లి స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించారు. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు 17 మందికాగా జనసేన నుంచి మాజీ మంత్రి కొణతల రామకృష్ణ ఉన్నారు.
రాష్ట్రంలో మొత్తం 29 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలుండగా తొలి జాబితాలోనే 20 మందిని ప్రకటించారు. ఆ 20 మంది తెలుగుదేశం పార్టీ వారే. వీరిలో 10మంది మొదటిసారి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. వారిలో పి. గన్నవరం నుంచి మహాసేన రాజేష్, తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు సామాజిక కార్యకర్తలు. జగన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వివిధ రూపాల్లో పోరాడుతున్నారు.
టీడీపీ-జనసేన మొదటి జాబితాకి తాడేపల్లి ప్యాలెస్ కంపించింది: బోండా ఉమా
కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్న విజయ బోనెల పార్వతీపురం నుంచి అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ ప్రవాసాంధ్రుడు. ఈయన స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. పామర్రు నుంచి బరిలోకి దిగుతున్న వర్లకుమార్ రాజా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కుమారుడు. యర్రగొండపాలెం నుంచి బరిలో ఉన్న ఎరిక్షన్‌బాబు సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగారు. సూళ్లూరుపేట టికెట్ దక్కించుకున్న నెలవల విజయశ్రీ వృత్తిరీత్యా వైద్యురాలు.
మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కూతురు. కోడుమూరు నుంచి బరిలో ఉన్న దస్తగిరి వృత్తిరీత్యా న్యాయవాది. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్‌కుమార్‌కి అవకాశం ఇచ్చారు. ఆయన దంత వైద్యుడు. గంగాధర నెల్లూరు నుంచి పోటీలో ఉన్న థామస్ బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ చేశారు. ఏడు ఎస్టీ నియోజకవర్గాలకుగానూ కురుపాం, సాలూరు, అరకులకు తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించింది.
సీఎం జగన్ ఓడిపోవడానికి, పారిపోవడానికి సిద్ధంగా ఉండాలి: కాలవ శ్రీనివాసులు
ఒక్క కుటుంబంలో ఒక్కరికే టికెట్: తెలుగుదేశం తరపున పోటీచేసే వారిలో పలువురు రాజకీయ నేపథ్యం కల కుటుంబాల నుంచి వచ్చారు. వీరిలో కొంత మంది తొలిసారి పోటీలో దిగుతుండగా మరికొంత మందికి గతంలో పోటీచేసిన అనుభవం ఉంది. ఒక్క కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇవ్వాలన్న విధాన నిర్ణయానికి కట్టుబడి కొంతమంది నాయకుల కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు టికెట్లు ఆశించినా ఒకరికే పరిమితం చేసింది.
కోట్ల కుటుంబంలో సూర్యప్రకాశ్ రెడ్డికి డోన్, కేఈ కుటుంబంలో శ్యాంబాబుకు పత్తికొండ, పరిటాల కుటుంబంలో సునీతకు రాప్తాడు, భూమా కుటుంబంలో అఖిలప్రియకు ఆళ్లగడ్డ నియోజకవర్గాలను కేటాయించింది. ఈ కుటుంబాల నుంచి వీరితో పాటు ఇతరులు కూడా టికెట్లు ఆశించినా, అధిష్ఠానం ఒక్కరికే అవకాశం ఇచ్చింది.