TDP BJP Janasena Alliance: రాష్ట్రంలో ఎన్నికల వేడి ముందు వేసవి వేడి చిన్నబోతోంది. 40 డిగ్రీల పైబడిన ఎండలను సైతం లెక్కచేయకుండా అభ్యర్థులు ఊరువాడా జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఏ వీధిలో చూసినా కూటమి జెండాలు, సూపర్-6 నినాదాలే వినిపిస్తున్నాయి. అలుపెరగకుండా ప్రచారం సాగిస్తున్న కూటమి అభ్యర్థులకు పలుచోట్ల మహిళలు మంగళ హారతులతో బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో భాంగా ఊరు వాడ అంటూ తేడా లేకుండా కూటమి నేతలతో కలిసి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొంటున్నారు.
మహిళలతో కలిసి పలు వార్డుల్లో ప్రచారం: విజయవాడ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్‌కు మద్దతుగా ఆయన భార్య, కుమారుడు నగరంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సుపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. డ్రైనేజీ రైలింగ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కొండప్రాంత వాసులు వాపోయారు. పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేసి జగన్ పేదల కడుపు కొట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే డ్రైనేజీ సమస్యలు తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తనుయులు పేర్కొన్నారు. అలాగే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కృష్ణప్రసాద్ సతీమణి శిరీష: మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి శిరీష నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జి.కొండూరు, ఇబ్రహీంపట్నంలో స్థానిక పార్టీ నాయకులు, మహిళలతో కలిసి పలు వార్డుల్లో ప్రచారం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక సమస్యలను వంద రోజుల్లో పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.