Tax Evasion in Foreign Liquor Sales Scam Updates : హైదరాబాద్‌లోని టానిక్ మద్యం దుకాణం, దాని అనుబంధ క్యూ దుకాణాలు జీఎస్టీ, వ్యాట్, ప్రివిలేజ్ ఫీజుల్లో ఎగవేతలకు పాల్పడినట్లు ప్రభుత్వ యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల అధికారులు ఆయా దుకాణాల్లో సోదాలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వాటిని నిశితంగా పరిశీలించి త్వరలోనే తెలంగాణ సర్కార్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Tax Evasion Tonique Liquor Stores :టానిక్ మద్యం దుకాణం ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రత్యేకంగా వెసులుబాటు కల్పిస్తూ జీవో ఇచ్చిన కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందనే ఆరోపణలపై రెండు శాఖలూ కూపీ లాగుతున్నాయి. అసలు ఆ జీవో ఇవ్వడంలోనే దురుద్దేశం ఉన్నట్లు తెలంగాణ సర్కార్ అనుమానం వ్యక్తం చేస్తోంది. మరెవరికీ ఈ అవకాశం ఇవ్వకుండా కేవలం ఆ ఒక్క దుకాణానికి మాత్రమే ఎలైట్ షాప్ కోసం అనుమతి ఇచ్చారు. ఇందులోని మతలబుపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.
మూడేళ్లపాటు ప్రివిలేజ్ ఫీజులో వెసులుబాటు : 2016లో ఎలైట్ రూల్స్ పేరుతో ఇచ్చిన జీవో ద్వారా ఏర్పాటైన టానిక్ మద్యం (Tonique Liquor Shops Case) దుకాణానికి మూడు సంవత్సరాల పాటు ఎలాంటి ప్రివిలేజ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించారు. తెలంగాణలోని 2,620 మద్యం దుకాణాల్లో మరేదానికీ ఇలాంటి సదుపాయం లేదు. మిగిలిన దుకాణాలన్నీ రెండేళ్లకోసారి కొత్త లైసెన్స్ కోసం లాటరీలో పాల్గొనాల్సి ఉంటుంది. టానిక్‌కు మాత్రం ఎలాంటి టెండర్ అవసరం లేకుండా ఏకంగా ఐదేళ్లపాటు లైసెన్స్ కట్టబెట్టారు.