Tax Burden on People in YSRCP Govt: ప్రజలను అడ్డమైన పన్నులతో పీడించిన పాలకుడి ప్రస్తావన వస్తే ఇప్పటివరకు ఔరంగజేబు గుర్తుకొస్తారు. ఐదేళ్ల పాలనలో చెత్త పన్నులన్నీ వేసి ప్రజల్ని హింసించిన జగన్ ఆ ఔరంగజేబునే మించిపోయారు. ఐదేళ్లుగా జనం రక్తం పీల్చేయడమే ఎజెండాగా పాలించిన జగన్ మరోసారి ఆస్తి పన్ను పెంపుతో పట్టణాల్లోని ప్రజలకు వాతలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను మరో 15 శాతం పెంచేసి ప్రజల నడ్డి విరవబోతున్నారు. తాజాగా 15 శాతం పెంపుతో 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను డిమాండ్ నోటీసుల్ని పట్టణ స్థానిక సంస్థలు సిద్ధం చేస్తున్నాయి.
రాష్ట్రంలో దశాబ్దాలుగా అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానం అమలులో ఉంది. ఐదేళ్లకు ఒకసారి పన్ను సవరించాలన్న నిబంధన ఉంది. కానీ, ప్రజలపై భారం వేయకూడదన్న ఉద్దేశంతో ఈ నిబంధనను ప్రభుత్వాలు అంత నిక్కచ్చిగా అమలు చేయలేదు. చివరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో నివాస భవనాలకు, 2007లో వాణిజ్య భవనాలకు ఆస్తిపన్ను సవరించారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ఆర్థికలోటు వేధిస్తున్నా ఆస్తిపన్ను పెంపు జోలికి వెళ్లలేదు.
లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ - అనూహ్యంగా ముగ్గురికి సీటు - BJP MP Candidates List
జగన్ అధికారంలోకి వచ్చాక నగరాలు, పట్టణాల అభివృద్ధికి చేసిందేమీ లేకపోగా అప్పటి వరకున్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానం తీసేసి, 2021-22 నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధిస్తున్నారు. ఫలితంగా పన్ను కొన్ని వందల రెట్లు పెరిగిపోయింది. ఒకేసారి అంత భారీగా పన్ను పెంచేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని ఏటా 15 శాతం చొప్పున పెంచుతూ వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కొత్త విధానంలో పెరిగిన పన్ను మొత్తంతో సమానమయ్యే వరకు ఏటా 15శాతం చొప్పున పన్ను పెరుగుతూనే ఉంటుంది.
ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆస్తుల విలువల్ని సవరిస్తుంది కాబట్టి పన్ను పెరుగుతూనే ఉంటుంది. అంటే ఏటా 15శాతం పెంపు కొనసాగుతూనే ఉంటుంది. నగరాలు, పట్టణాల్లో 2020-21లో 1,157 కోట్ల రూపాయలుగా ఉన్న ఆస్తిపన్ను డిమాండ్ 2024-25 నాటికి 2వేల 109 కోట్ల రూపాయలకు చేరబోతోంది. అంటే నాలుగేళ్లలో 82.27శాతం పెరిగి ప్రజలపై 952 కోట్ల రూపాయలకుపైగా అదనపు భారం పడింది. పొరపాటున వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే 2025-26 నుంచి 2029-30 వరకు ఐదేళ్లలో పట్టణ ప్రజలు మరో 2వేల135 కోట్ల రూపాయల అదనపు భారం మోయాల్సి ఉంటుంది.