Food Adulteration in Hyderabad : అలా బయటకు వెళ్లి ఏదైనా తినాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించాల్సిందే! ఎందుకంటే కంటికి ఇంపుగా కనిపించే ఆహార పదార్థాలన్నీ మేలైనవి కావు. అందులో నాసిరకం ఉండొచ్చు. ప్రమాదకరమైన పదార్థాలూ కలవొచ్చు. ఇటీవల హైదరాబాద్‌లో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందం హోటళ్లలో నిర్వహిస్తోన్న తనిఖీల్లో ఇలాంటి నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Officials Raids on Hotels in Hyderabad: హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, స్వీట్ షాపుల్లో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందం సోదాలను కొనసాగిస్తోంది. గడిచిన మూడు రోజులుగా గుర్తించిన లోపాలను అధికారులు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, చైతన్యపురి ప్రాంతాల్లోని హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్, షవర్మ తయారీ, బేకరీలు, మండీ హౌజ్‌ల కేంద్రాల్లో తనిఖీలు చేపట్టగా దారుణమైన పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. తినడానికి ఏమాత్రం పనికిరాని కూరగాయలు, క్యాన్సర్ కారక రంగులు, మాంసం ఉపయోగిస్తుండటంతో పాటుగా గ్రీజులా మారిన వంట నూనె, ఇతరత్రా లోపాలు బహిర్గతమయ్యాయి.
యూసఫ్‌గూడలో :
- ఏజీ కాలనీలోని మహమ్మదీయ షవర్మ కేంద్రంలో గ్రీజులా మారిన నూనె, షవర్మ తయారీలో తుప్పు పట్టిన పాత్రల వినియోగం, ఫ్రిడ్జిలో కుళ్లిన ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ లైసెన్సు లేకపోవడం తదితర లోపాలు.
- రాజీవ్‌నగర్‌లోని అల్ ఖాసీం ది మండీ హౌజ్‌లో అపరిశుభ్రంగా ఉన్న వంట గదిలో నేలపైనే వంట సామగ్రిని ఉంచడం, ఫ్రిడ్జిలో మురుగువంటి నీరు, జిగటగా మారిన పైకప్పు, ఎక్జాస్ట్ ఫ్యాన్, పొయ్యి తదితరాలు..
- అల్ మతమ్ మదీనా మండీలో ఇరుకు గదిలో అపరిశుభ్రంగా ఉన్న వంటగది, సింథటిక్ రంగుల వినియోగం, నేలపై చెత్త, ఇతరత్రా
- అల్ మతమ్ అల్ హింద్ అరేబియన్ మండీలో అపరిశుభ్రమైన కిచెన్, చిమ్ని, వ్యర్థాలు, బొద్దింకలు..