Case Filed on Sajjala Ramakrishna Reddy :వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కౌటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించే ఏజెంట్లు తమకు అవసరం లేదని కౌంటింగ్ కేంద్రాలలో గొడవలకు సిద్ధంగా ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, న్యాయవాది గూడపాటి లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తాడేపల్లి కేసులు సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు.
సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ టార్గెట్ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని దానికి అవసరమైనవి తెలుసుకోవాలని, అవతలివారు (ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి) అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలని అన్నారు. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలని తెలిపారు. అంతే తప్ప రూల్ అలా ఉందని, అందుకే దాని ప్రకారం పోదాం అని మనం కూర్చోకూడదని సజ్జల స్పష్టం చేశారు.