Swarnandhra 2047 Vision Document: అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర- 2047 విజన్ డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు నేడు ప్రజల ఎదుట ఆవిష్కరించనున్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు అన్నదాతల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామనే హామీని ఇవ్వనున్నారు. రవాణా రంగంలో సౌకర్యాల కల్పన, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం వంటి విషయాలను తెలియజేయనున్నారు. ఉదయం 10న్నర గంటలకు విజయవాడలో జరిగే కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యాలను సీఎం చంద్రబాబు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రజల ముందు ఉంచనున్నారు. 2047 నాటికి తలసరి ఆదాయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ కావాలనే విషయాన్ని వివరించనున్నారు. ప్రజలూ తమ కుటుంబం 2047 ఏడాది నాటికి ఎలా ఉండాలో ఒక ఆలోచన చేయాలని, విజన్ తయారు చేసుకోవాలని సీఎం చంద్రబాబు కోరనున్నారు.
1999లో విజన్- 2020 రూపొందించి అమలు చేసిన ఫలితమే ప్రస్తుత హైదరాబాద్ అభివృద్ధి అని స్పష్టం చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో విజన్ మేనేజ్‌మెంట్ యూనిట్ ఏర్పాటు చేసి, జిల్లా, మండల స్థాయిల్లోనూ పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో 250 వర్క్‌స్టేషన్లు ఏర్పాటు ద్వారా ఎవరైనా పని చేసుకునే, నైపుణ్య శిక్షణ తీసుకొనే వీలు కల్పించనున్నారు. చదువుకున్న వ్యక్తులు, వర్చువల్‌గా పనిచేసే వారికి ఉద్యోగాలిప్పించి ప్రోత్సహిస్తారు.
జమిలి ఎన్నికలైనా అప్పుడే - ప్రజల్లోకి స్వర్ణాంధ్ర 2047 : సీఎం చంద్రబాబు
ఇవే విజన్ 2047లో ప్రధానం: సమయం ఉన్నప్పుడు పనిచేసి, అవసరం ఉన్నప్పుడు పనిచేయించుకునే కొత్త విధానం విజన్ 2047లో ప్రధానం. డిజిటల్ లెర్నింగ్, ట్రైనింగ్ పొందిన ఉపాధ్యాయులు, దగ్గర్లోనే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, టెలిమెడిసిన్ సౌకర్యాలు, అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. బ్యాంకింగ్ సేవలు, రుణాలు, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థానిక సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షిస్తారు. ఆర్థిక కార్యకలాపాలు చేపడతారు.
పేదరికం లేని సమాజం కోసం కుటుంబం యూనిట్‌గా ఇంటి స్థలం, మంచి నీరు, 24 గంటల విద్యుత్, వంటగ్యాస్, మరుగుదొడ్లు, మురుగునీటి పారుదల సౌకర్యం, సోలార్ రూఫ్‌టాప్, డిజిటల్ కనెక్టివిటీ, రాయితీపై సౌరవిద్యుత్తు వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తారు. ప్రతి కుటుంబం ఒక వృద్ధి కేంద్రం కావాలన్నది ఇందులో ప్రదానం, ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలన్నది లక్ష్యం. వారికి సామాజిక భద్రతతో పాటు సంక్షేమ పథకాలు, అందరికీ ఆరోగ్యం, విద్య, స్కిల్, మౌలిక సౌకర్యాలు, విస్తృత ఆరోగ్యసేవలు, బీమా సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
విజన్ 2047లో భాగంగా మహిళలకు అధిక అవకాశాలు కల్పిస్తారు. ఇంటి నుంచే పనిచేసుకుని ఆదాయం పొందే విధానం అందుబాటులోకి తెస్తారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక మద్దతివ్వనున్నారు. మహిళా ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. సీనియర్ సిటిజన్స్‌కు పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తారు. పర్యాటక ఆదాయాన్ని 4 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఉపాధి, ఉద్యోగాలకు పారిశ్రామిక పార్కులు, టౌన్‌షిప్స్ ఏర్పాటు చేయనున్నారు.
గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రపంచస్థాయి పారిశ్రామిక పార్కులు, అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయ ఖర్చుల తగ్గింపు, భూమి సారం పెంపు, పంటల మార్పిడి, అధిక విలువ కలిగిన పంటల సాగు, ఆక్వా క్లస్టర్ల ఏర్పాటు, వ్యవసాయంలో సౌర విద్యుత్ వినియోగం, ఈ-ట్రాక్టర్ల వాడకం, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, ఐఓటీ, డ్రోన్లు, రోబోటిక్స్, చీడపీడల గుర్తింపు, నియంత్రణకు ఉపగ్రహ సాంకేతికతకు ప్రాధాన్యమిస్తారు. ఆక్వాతో పాటు మామిడి, అరటి, మిరప, కాఫీ, పామోలిన్, సుగంధ ద్రవ్యాల పంటలకు స్పెషల్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు.
సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ భేటీ - స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌పై చర్చ
కోల్‌కతా- చెన్నై రైలు మార్గంలో 2 లైన్లను 4 లైన్లు చేసే ప్రణాళిక తయారైంది. రాష్ట్రాన్ని ఉత్పత్తి రంగ హబ్‌గా తయారు చేయనున్నారు. విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్శిటీ ఏర్పాటు, విమానాల మరమ్మతుల సెంటర్ పెట్టనున్నారు. జలరవాణా పునరుద్ధరించనున్నారు. సమ్మిళిత వృద్ధి, పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలన్నది లక్ష్యం. ఆర్థిక అసమానతలు తగ్గించనున్నారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన చేయనున్నారు. పరిశ్రమలు ఏర్పాటుతో నాణ్యత కలిగిన ఉద్యోగాలు ఇప్పించనున్నారు. నైపుణ్యం, మానవవనరుల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు.
రైతుకు వ్యవసాయంలో సాంకేతికతను విజన్ 2047లో భాగంగా ప్రోత్సహించనున్నారు. వ్యవసాయ ఖర్చులు తగ్గించటం లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతు ఆదాయం పెరిగి, గౌరవంగా జీవించాలన్నదే లక్ష్యం. వస్తు రవాణాకు ఖర్చులు తగ్గించడంపై దృష్టి సారించనున్నారు. ఇంధన వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని ప్రతి ఇల్లూ హరిత నివాసం కావాలన్నది మరో ప్రధాన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తయారు చేయనున్నారు.
ఏపీలో తయారయ్యే ప్రతి వస్తువుకు అదనపు విలువ జోడించనున్నారు. దానికి గ్లోబల్ బ్రాండ్ సృష్టించి జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రమోట్ చేయాలనే లక్ష్యంతో ప్రోత్సాహకాలిస్తారు. మానసిక ఉల్లాసం కావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛాంధ్ర ఎంతో ముఖ్యమనే లక్ష్యాన్ని నిర్దేశించుకోనున్నారు. శాటిలైట్, డ్రోన్, సీసీటీవీ, ఐఓటీ ద్వారా రియల్‌టైమ్ డేటా తీసుకునే వెసులుబాటు కల్పిస్తారు.
ప్రపంచస్థాయి వసతులతో ఏపీ మారిటైమ్ పాలసీ - ప్రపంచంలోని 20 భారీ పోర్టుల్లో ఒకటి ఇక్కడే