Supreme Court Orders On Encroachment In Kolleru Lake :కొల్లేరులో ఆక్రమణలను ఉక్కుపాదంతో అణచివేయడంతో పాటు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు ఉండబోవని అవగాహన కల్పించాలని సూచించింది. కొల్లేరులోకి చెత్త, మురుగునీరు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, మూడు నెలల్లోపు మొత్తం సరిహద్దులు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది.
కొల్లేరులో ఆక్రమణలను ఉక్కుపాదంతో అణచివేయండి - 3 నెలల్లోపు సరిహద్దులను ఖరారు చేయాలి: సుప్రీంకోర్టు (ETV Bharat) కొల్లేరు సరస్సులో సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకొని వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరంగా మారిన ఆక్రమణలను ఉక్కుపాదంతో అణచివేయాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతేడాది డిసెంబరు 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు నెలల్లోపు కొల్లేరు సరిహద్దులను ఖరారు చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించింది. మున్సిపల్ ఘన వ్యర్థాలు, చుట్టుపక్కల పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగునీటిని కొల్లేరులోకి వదలకుండా అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు ఉండవంటూ రాష్ట్ర ప్రభుత్వం వారికి అవగాహన కల్పించి కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డు తగలకుండా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.
కొల్లేరు సంరక్షణ కోసం 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడకు చెందిన మృత్యుంజయరావు గతేడాది సెప్టెంబరు 1న పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కొల్లేరు సరస్సులోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న చిన్న, పెద్ద చేపల చెరువులను నిర్దిష్ట గడువులోగా ధ్వంసం చేయాలని వంద ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో ఉన్న చెరువులను 15 రోజుల్లోపు, మిగిలిన చెరువులను 2006 మే 31లోపు తొలగించాలని కేంద్ర సాధికార సంస్థ - సీఈసీ 2006 మార్చి 20న ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఆ నివేదికలోని అంశాలను తు.చ. తప్పకుండా అమలు చేయాలని, చేపల పెంపకంలో ఉపయోగించే ఎరువుల రవాణాను నిలిపేయాలని, చేపల చెరువులను ధ్వంసం చేసే కార్యక్రమం 2006 ఏప్రిల్ 20 నుంచే మొదలుపెట్టాలని 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనందున కోర్టుధిక్కరణ చర్యలు తీసుకోవాలని మృత్యుంజయరావు పిటిషన్ దాఖలు చేశారు.
ఆక్రమణల చెరలో ఉప్పుటేరు- దారిలేక లంకగ్రామాలను కుమ్మేస్తోన్న బుడమేరు - Kolleru Lanka Stuck in Flood Effect
ఆర్‌టీఐ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 15వేల339 ఎకరాలు వివిధ వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్లు అమికస్ క్యూరీ కోర్టుకు నివేదించారు. సరస్సు 901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించినా అందులో 308.55 చదరపు కిలోమీటర్లు మాత్రమే వన్యప్రాణి సంరక్షణకేంద్రం కింద నోటిఫై చేసినట్లు అమికస్ క్యూరీ తెలిపారు. 6,908 హెక్టార్లలో ఆక్వాకల్చర్ ఉందన్న అమికస్ క్యూరీ ప్రస్తుతం న్యాయస్థానం ముందుంచిన సమాచారం ప్రకారం చెరువు గట్ల నిర్మాణం వల్ల సరస్సులో సహజ నీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయని వివరించారు. కలెక్టర్ అనుమతులతోనే భారీగా పెట్టుబడులు పెట్టి చేపల చెరువులు ఏర్పాటు చేసుకున్న వారి ప్రయోజనాలు రక్షించాలన్న వినతిని కోర్టు తిరస్కరిస్తోందని ధర్మాసనం స్పష్టం చేసింది.
వాణిజ్య కార్యకలాపాల కోసం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో నీటి ప్రవాహాన్ని మళ్లించి నీటి మట్టాన్ని తగ్గిస్తున్నారని వాటిని పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల అమలును వ్యతిరేకిస్తున్న రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి వారికి అవగాహన కల్పించాలని సూచించింది. గత ఏడాది డిసెంబరు 11న సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను అనుసరించి మూడు నెలల్లోపు రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన డిజిటల్ మ్యాప్‌లతో ఈ చిత్తడి నేలల సరిహద్దులను క్షేత్రస్థాయిలో ఖరారు చేయాలని ఆక్రమణలను తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నదీ చెప్పాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. చిత్తడి నేలలను సరిగా సంరక్షించడం లేదని కోర్టుకు సమర్పించిన ఫొటోల ద్వారా తెలుస్తోందన్న ధర్మాసనం ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆదేశించింది.
గత ఏడాది అక్టోబరులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ఇప్పటి వరకు 5వేల ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది దేవదత్ కామత్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా అక్కడికి వలస పక్షుల రాక పెరిగిందని అదే సందర్భంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా చూడాల్సి వస్తోందని కోర్టు వివరించారు. 3 నెలల్లో మొత్తం సరిహద్దులను నిర్ధరిస్తామని, అందుకు తమకు 8 వారాల సమయం ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరఫున అమికస్ క్యూరీ పరమేశ్వర్ క్షేత్రస్థాయి పరిస్థితులను కోర్టుకు వివరించారు.
ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల కుమ్మక్కును కొట్టి పారేయలేమని వాదనల సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఆక్రమణలు తొలగించినా అవి పునరావృతం కాకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ సూచించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయంలోనూ మెరిట్ ఉందని, అందుకే ఈ మేరకు ఉత్తర్వులు ఇస్తున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా సమయం ఇస్తున్నామన్న జస్టిస్ గవాయ్ తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేశారు. ఆలోపు అఫిడవిట్ రూపంలో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
కొల్లేరులో వైసీపీ కల్లోలం - ఇష్టారాజ్యంగా అక్రమ చెరువుల తవ్వకాలు