చిన్నారుల కోసం వేసవి శిక్షణ శిబిరాలు (ETV bharat) Summer Camps for Children :వేసవి సెలవులు వచ్చాయంటే చాలు, పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. ఎక్కువగా ఆడుకోడానికి ఇష్టపడే పిల్లలు కొత్తగా ఏదైనా నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఆటపాటలకు దూరమైన పిల్లల్లో, వేసవిలో హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్, గ్రంథాలయ శాఖ కలిసి నిర్వహించే ప్రత్యేక శిక్షణ శిబిరాలు నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ శిక్షణ చిన్నారులకు విజ్ఞానం, వినోదం అందిస్తూ వారిలోని సృజనాత్మకతను తట్టి లేపుతున్నాయి.
చిన్న వయసు నుంచే పిల్లలకు పుస్తక పఠనంపై ఆసక్తి కల్పించడం ద్వారా వ్యక్తిత్వ వికాసంతో పాటు, వారిలోని సృజనను వెలికితీసే అవకాశం ఉటుంది. ఇదే ఉద్దేశంతో హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ , గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో, ఏటా వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఈ నెల 15న ప్రారంభమైన తరగతులు, నిత్యం మూడు గంటల పాటు శిక్షణ అందిస్తున్నారు. పిల్లలకు పుస్తక పఠనం, కథలు చెప్పించడం, ఆంగ్లం, గణితం, తెలుగు ఇలా అనేక రకాల పాఠ్యాంశాల్లో పట్టు సాధించేలా ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
నౌకా ,రక్షణ దళ సిబ్బంది ఉద్యోగుల పిల్లలకు వేసవి శిక్షణ
స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాల గురించి పాటల రూపంలో చెప్పటం, వారితో పాడించటం వంటివి చేస్తున్నారు. విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించటం, సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటాన్ని వివరిస్తున్నారు. వీటితోపాటు పిల్లల మేధస్సుకు పదును పెట్టే, చదరంగం లాంటి ఆటలు, చిత్రలేఖనం, పెయింటింగ్స్, నృత్యం, కాగితాలతో కళాకృతులు తయారు చేసేటువంటి సృజనాత్మకత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ నూతన కార్యక్రమాన్ని నేర్చుకోవటంతో శిక్షణాతరగతుల పట్ల విద్యార్థులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు.
పిల్లల్లో ఉత్సాహాన్ని గమనించిన ఉపాధ్యాయులు, వారికి కొత్త విషయాలు నేర్పించేందుకు పోటీపడుతున్నారు. తరగతి గదిలో చెప్పే విషయాలు కాకుండా, వ్యక్తిత్వ వికాసం, దైనందిన జీవితంలో ఉపయోగపడే అంశాలను బోధిస్తున్నారు. పిల్లలతో కలిసిపోతూ వారిలోని సృజనను బయటకి తీసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నాం. డి. శ్రీవల్లి, ఉపాధ్యాయరాలు
హేలాపురి బాలల క్లబ్, జిల్లా గ్రంథాలయ శాఖ సంయుక్తంగా చేస్తున్న ఈ వేసవి శిక్షణ శిబిరాలకు మంచి స్పందన లభిస్తుందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ శిబిరాల్లో బోధించేందుకు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ చిన్నారుల్లో నూతనోత్సాన్ని నింపుతున్నారని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ శిబిరాలను మరింత సమర్థవంతంగా నిర్వహంచడంతో పాటు, ఎక్కువ మంది పిల్లలకు విజ్ఞానం, వినోదాన్ని అందించడమే లక్ష్యంగా కృషి చేస్తామంటున్నారు. ఏలూరు నగరంలో 20కి పైగా శిక్షణ శిబిరాలతో పాటు, జిల్లాలోని ఉంగుటూరు, భీమడోలు, పూళ్ల, నిడమర్రు, గుండుగొలను, గణపవరం, పిప్పర, చాట్రాయి, కైకలూరు, నూజివీడు, ఆగిరిపల్లిలో ఇస్తున్న శిక్షణా తరగతులు వచ్చే నెల 7 వరకు జరగనున్నాయి.
రుసుము చెల్లిస్తేనే క్రీడా శిక్షణ..