పాఠశాలల్లో ఊడుతున్న పెచ్చులు - విద్యార్థులకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం Students Suffering Due to Negligence of Nadu Nedu Works : నాడు - నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నాం. ప్రైవేటు బడులకంటే మెరుగ్గా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం తరచూ చెప్తుంటుంది. అదంతా ఒట్టి మాటలకే కానీ చేతల్లో కాదని ప్రభుత్వ పాఠశాలలే రుజువు చేస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా దర్శనమిస్తున్నాయి. నాడు- నేడు పథకంలో భాగంగా కొన్ని పాఠశాలనే అభివృద్ధి చేసి చేతులు దులుపుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనంలో బిక్కుబిక్కుమంటూ చదువుతున్నారు.
జగనన్న సర్కారులో చదువులంటే విద్యార్థుల్లో గుండెల్లో గుబులే- శిథిలావస్థకు చేరినా పట్టించుకోని పాలకులు
YSRCP GovernmentNegligenceinNadu NeduWorks : కృష్ణా జిల్లా నిడుమోలు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గోడలకు పెచ్చులు ఉడిపోయి ఎప్పుడు పడిపోతుందో తెలియని సామాజిక భవనంలో విద్యార్ధులు చదువుకుంటున్నారు. ఇరుకు గదుల్లో విద్యార్థులు కుర్చోవడానికే ఇబ్బందులు పడుతుంటే మళ్లీ ఆ గదుల్లోనే పాఠశాల నిర్వహణకు సంబంధించిన వస్తువులు, టేబుల్స్‌ను కూడా వేయడంతో ఇంకా ఇరుకుగా మారింది.
"విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిడుమోలు ప్రధాన రహదారిపై ఉన్న పాఠశాలను 2016లో తొలగించారు. తొలగించినప్పటి నుంచి ఆ పాఠశాలను ఎస్సీవాడలో 1996వ సంవత్సరంలో నిర్మాణం చేసిన సామాజిక భవనంలో తరగతులు కొనసాగిస్తున్నారు. నిర్వహణ లేకపోవడంతో ఆ భవనం శిథిలావస్థకు చేరింది. వర్షాకాలంలో గోడలు, శ్లాబు కారుతూ పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. పాఠశాల ఖాతాలోని నగదు మండల పరిషత్తు అకౌంట్‌కు బదిలీ చేశారు. అనంతరం ఎస్సీవాడలో పంచాయతీ స్థలం కేటాయించడంతో భవన నిర్మాణానికి నిధులు కోరుతూ ప్రతిపాదనలు పంపారు. ఎట్టకేలకు నాడు-నేడు కింద పనులు ప్రారంభించగా 7లక్షల 70 వేల రూపాయలు మాత్రమే విడుదలయ్యాయి. మిగతా నిధులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. శిథిలావస్థకు చేరిన పాఠశాలకు పిల్లలను పంపాలంటే భయంగా ఉంది." - శశిరేఖ, విద్యార్థి తల్లి
"ఒకటి నుంచి మూడో తరగతి చదివే చిన్న చిన్న పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. అటువంటి పిల్లలు ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం నాలుగున్నరేళ్ల నుంచి మీనమేషాలు లెక్కిస్తూ ఉంది. ఎస్‌డబ్ల్యూ పాఠశాలకు నాడు -నేడు రెండో దశ కింద 28లక్షల74 వేల రూపాయలు మంజూరు చేయగా 2022, డిసెంబరు 23న పాఠశాల విద్యా కమిటీ పనులు ప్రారంభించింది. నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. శిథిలమైన సామాజిక భవనం వరండాలో బిక్కుబిక్కుమంటూ విద్యార్ధులు చదువుకుంటున్నారు." -నీలం వెంకటేశ్వరరావు, స్థానికుడు
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే కొత్త భవనాలు కట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
నాడు-నేడు పనుల్లో బయటపడుతున్న డొల్లతనం.. ఇదేనా మీరు మార్చిన రూపురేఖలు సీఎం గారూ.?