STUDENT AND CLEANER DIED IN PULIPADU : ఓ డ్రైవర్ నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలి తీసుకుంది. చదువుకుని గొప్ప వాడవుతాడని కలలు గన్న ఆ తల్లిదండ్రులకు తీవ్ర శోకం మిగిల్చింది. రోజులాగే పాఠశాల బస్సులో స్కూల్‌కు వెళ్లిన విద్యార్ధి నీటి కుంట (farm pond) లో పడ్డాడు. చిన్నారిని రక్షించేందుకు వెళ్లిన బస్సు క్లీనర్ సైతం కుంటలో పడి మృతి చెందాడు. ఆ ఇద్దరి మరణం పల్నాడు జిల్లా పులిపాడులో సంచలనం రేపింది. ఇద్దరి మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యం, బస్సు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
తన పాఠశాల బస్సు కోసం నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన బాలుడితో పాటు కాపాడేందుకు వెళ్లిన బస్సు క్లీనర్ నీటి కుంటలో పడి మరణించారు. బస్సు డ్రైవర్, యాజమాన్య నిర్లక్ష్యానికి ఇద్దరు మరణించటంతో స్థానికులు, బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. చదువుకుని గొప్పవాడవుతాడన్న బాలుడు, 11 యేళ్ల వయసులోనే మృత్యువాత పడటం అందరినీ కలచివేసింది.
పులిపాడు గ్రామానికి చెందిన సుభాష్ దాచేపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. రోజులాగే తల్లిదండ్రులు స్కూల్ బస్సు ఎక్కించి పంపించారు. మార్గ మధ్యలో స్కూల్ రేడియేటర్లో నీళ్లు అయిపోవడంతో బస్సు ఆగిపోయింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న కుంటలో నీళ్లు తెచ్చేందుకు బస్సు డ్రైవర్ విద్యార్థి సుభాష్‌ను పంపాడు. నీటి కోసం వెళ్లిన సుభాష్ నీళ్లు లోతులో ఉండటంతో పాటు చుట్టుపక్కల ప్లాస్టిక్ షీట్‌తో కప్పి ఉండటంతో హఠాత్తుగా కుంటలో పడ్డాడు.
ఇది గమనించిన బస్సు క్లీనర్ సుబాష్‌ను కాపాడేందుకు నీటి కుంట వద్దకు వెళ్లాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో అందులో పడి మృతి చెందారు. ఇదే బస్సుకు చెందిన డ్రైవర్ మద్యం సేవిస్తూ బస్సు నడుపుతున్నాడని గతంలో తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. మళ్లీ తప్పు జరగకుండా చూస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన పాఠశాల యాజమాన్యం, అదే డ్రైవర్‌ను కొనసాగించిందని ఆరోపిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టాలని మృతుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.