విద్యార్థులు భద్రమేనా- స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై స్పెషల్ స్టోరీ (ETV Bharat) Schol Bus Fitness Checkings Story : బడి బస్సులు భద్రంగా ఉంటేనే పిల్లలు సురక్షితంగా పాఠశాలకు వెళ్లి ఇంటికి చేరగలుగుతారు. కానీ, బస్సుల భద్రతపై ఎప్పుడూ సందేహమే. ఏటా పాఠశాలల ప్రారంభ సమయంలో ఇదో చర్చనీయాంశం కూడా. రవాణాశాఖ అధికారులు సైతం పాఠశాలల ప్రారంభ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బస్సుల ఫిట్‌నెస్ అంశాలను పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 23,824 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి.
రాష్ట్రంలో బడిగంట మోగింది - పిల్లల సందడి మొదలైంది - Telangana Schools Reopening
వీటిలో 14,170 బస్సులకు మాత్రమే సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ఇంకా 9,654 బస్సులు ఇంకా ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు పొందనేలేదు. హైదరాబాద్‌లో 1,290 బస్సులు ఉండగా 904 బస్సులు ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. ఇంకా 386 బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లాలో 5,732 బడి బస్సులు ఉండగా ఇప్పటి వరకు 3,250 బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తిచేశారు.
పూర్తికాని ఫిట్‌నెస్ తనిఖీలు.. ఇంకా 1,482 బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయాల్సి ఉంది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 5,609 బస్సులుంటే 4,334 బస్సులకు ఫిట్ నెస్ పరీక్షలు పూర్తిచేశారు. ఇంకా 1,275 బస్సులకు సామర్థ్య పరీక్షలు చేయాల్సి ఉంది. ఇతర జిల్లాల్లో 11,193 బస్సలు ఉండగా 4,682 బస్సులకు మాత్రమే ఫిట్ నెస్ పరీక్షలు పూర్తిచేశారు. ఇంకా 6,511 బస్సులకు ఫిట్ నెస్ పరీక్షలు పూర్తిచేయాల్సి ఉంది.
ఒక వాహనం జీవితకాలం 15 సంవత్సరాలు. ఆ తర్వాత తుక్కుగా మార్చాలి. కానీ, పలు జిల్లాల్లో పాఠశాలల యాజమాన్యాలు కాలం చెల్లిన డొక్కు బస్సులకు తాత్కాలిక మరమ్మత్తులు చేయించి వాటిని నడిపిస్తూ పిల్లల భధ్రతతో చెలగాటం ఆడుతున్నాయి. ఇలాంటి వాటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని అధికారులు పైకి చెబుతున్నారు. కానీ, వాటిని రోడ్లపై తిరగకుండా ఆపేందుకు కఠిన చర్యలు తీసుకోవడం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.
నామమాత్రంగానే ఫిట్‌నెస్ పరీక్షలు.. సామర్థ్య పరీక్షలకు యాజమాన్యాలు తమ బస్సుల్ని రవాణాశాఖ కార్యాలయాలకు పంపిస్తున్నాయి. వచ్చిన బస్సులకు రవాణాశాఖ అధికారులు నామమాత్రంగానే ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. కొన్నింట్లో భూతద్దం పెట్టి వెతికినా ప్రథమ చికిత్స కిట్లు కనిపించడం లేదు. సామర్థ్య పరీక్షలో పాసైనట్లు అధికారులు ధ్రువీకరిస్తున్న 90% బస్సుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొత్తగా కొనుగోలు చేసిన వాటిలో మాత్రమే ప్రథమ చికిత్సకిట్లు ఉంటున్నాయి.
ఫిట్‌నెస్‌ను పరిశీలించే విధానం గతంలో కంటే కొంత మెరుగుపడినా అనేక లోపాలు ఉన్నాయి. ప్రతిదాన్ని స్వయంగా నడిపి పరీక్షించాలి కానీ, ఒక్కో విద్యాసంస్థకు సంబంధించి పదుల సంఖ్యలో వాహనాలుంటే రవాణా శాఖ అధికారులు మాత్రం కొన్నింటినే పరిశీలిస్తున్నారు. ఎక్కువ లోపాలు ఉన్నవాటికి మాత్రం సర్టిఫికెట్లు నిరాకరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోనే 15 ఏళ్లు దాటిన డొక్కు బస్సులు 450 ఉన్నట్లు సమాచారం. జగిత్యాలలో 235 బస్సులు, పెద్దపల్లిలో 18 బస్సులు , సిరిసిల్లలో 22 డొక్కు బస్సులు ఉన్నాయి. ఈ 4 జిల్లాల్లో మొత్తం 1,637 బస్సులు ఉంటే 15 ఏళ్లు దాటిన వాటి సంఖ్య 725 పైగానే ఉన్నాయి.
యాజమాన్యాలకు నోటీసులు.. రవాణాశాఖ అధికారులు లెక్కల ప్రకారం కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో 44% డొక్కు బస్సులు తిరుగుతున్నట్లు తెలుస్తుంది. హనుమకొండ జిల్లాలో 1,058 విద్యాసంస్థల బస్సులు ఉంటే ధ్రువీకరణ పత్రం పొందినవి 798 బస్సులు మాత్రమే ఉన్నాయి. 149 బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ నిరాకరిస్తూ యాజమాన్యాలకు అధికారులు నోటీసులిచ్చారు. మిగిలిన బస్సులను అసలు సామర్థ్య పరీక్షలకే తీసుకురాలేదు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 439 పాఠశాలల బస్సులు ఉంటే 226 ఫిట్‌నెస్ పరీక్షలో పాస్ కాగా, 22 వాహనాలకు సర్టిఫికెట్లు తిరస్కరించారు. 191 పరీక్షకే రాలేదని రవాణాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 648 బడి, కళాశాల బస్సులు ఉండగా 344 ఫిట్‌నెస్ పరీక్షకే రాలేదు. ఫిట్‌నెస్ సాధింనవి కేవలం 284 మాత్రమే ఉన్నాయి. మెదక్ జిల్లాలో- 262 బస్సులు ఉంటే 70, సిరిసిల్ల జిల్లాలో 140 బడి బస్సులు ఉంటే 40, కరీంనగర్ జిల్లాలో 784 బడి బస్సులు ఉంటే 479, జగిత్యాల జిల్లాలో 465 బడి బస్సులకు 293, పెద్దపల్లి జిల్లాలో 238 బస్సులకు 82 మాత్రమే ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు పొందాయి.
వాస్తవానికి పాఠశాలల ప్రారంభానికి ముందే బడి బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తిచేయాలి. కానీ, రవాణాశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఇంకా వేలాది బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలే నిర్వహించలేదు. మిగిలిన బస్సులకు రెండు రోజుల్లో పరీక్షలు పూర్తిచేయాలి. కాగా విద్యాసంస్థల బస్సులకు 12వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించినట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఫిట్‌నెస్ లేకుండా రోడ్డు ఎక్కే వాటిని తనిఖీ చేసి జరిమానా విధిస్తామని అధికారులు చెబుతున్నారు. ఐతే ఏటా పాఠశాలల ప్రారంభంలో మాత్రమే బడిబస్సుల ఫిట్‌నెస్‌లపై అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత వదిలేస్తున్నారు. మరి ఈసారి రవాణాశాఖ అధికారులు నిబంధనలు ఏవిధంగా అమలుచేస్తారో వేచిచూడాల్సిందే.
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కూల్ టైమింగ్స్‌లో మార్పు - New School Timings in Telangana
రాష్ట్రంలో బడిగంట మోగింది - పిల్లల సందడి మొదలైంది - Telangana Schools Reopening