Story On National Handloom Day 2024 : భరతమాతకి బ్రిటిష్‌వాళ్లు వేసిన దాస్యశృంఖలాలు తెంచేందుకు గాంధీ నేతృత్వంలో కోల్కతాలో 1905 ఆగస్టు 7న విదేశీ వస్త్ర బహిష్కరణ స్వదేశీ ఉత్పత్తుల పునరుద్ధరణ ఉద్యమం చేపట్టారు. ఉద్యమం ఆరంభమైన ఆగస్టు 7ను 'జాతీయ చేనేత దినోత్సవం'గా నిర్వహించాలని 2015లో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అదేరోజున చెన్నైలో జాతీయ స్థాయి చేనేత, హస్తకళల పురస్కారాలను చేనేత కళాకారులకు ప్రదానం చేశారు.
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చేనేత వస్త్రాలు :ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు 50 మంది చేనేత హస్తకళల పురస్కారాలను పొందడం ఇక్కడి చేనేత రంగానికి దక్కిన గౌరవం. ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూదాన్ పోచంపల్లి, గట్టుప్పల్,నారాయణపురం, చండూరు, మునుగోడు, పుట్టపాక, కొయ్యలగూడెం, నారాయణపురం, సిరిపురం, వెల్లంకి గ్రామాల్లో తయారైన ఇక్కత్ వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి.
చేనేత కార్మికుల కష్టాలు :చేనేత కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటిల్లిపాదీ శ్రమించి మగ్గాలపై కళాత్మక వస్త్రాలు నేస్తున్నారు. దేశంలో వ్యవసాయం తరువాత అధిక మందికి ఉపాధి కల్పిస్తుంది చేనేత రంగమే. ప్రపంచమంతా మెచ్చిన ఈ వస్త్రాలను తయారు చేసిన వారు మాత్రం జీవితంలో వెలుగు లేదని ఆవేదన చెందుతున్నారు. కొత్త ప్రింటెట్ వస్త్రాలు మార్కెట్‌లోకి రావడంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నామని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు.