Stay Rings Work Started at Polavaram Hydropower Station: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో టర్బైన్ల ఏర్పాటులో కీలకమైన స్టే రింగ్‌ల అమరిక పనులు ప్రారంభమయ్యాయి. ఈ స్టే రింగ్‌ల అమరికకు 320 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన క్రాలర్ క్రేన్ వినియోగిస్తున్నారు. స్టే రింగ్ అమరిక పనుల ప్రారంభం సందర్భంగా జరిగిన పూజ కార్యక్రమంలో పోలవరం జల విద్యుత్ కేంద్రం ఏపీ జెన్కో ఎస్ఈ రామ భద్రరాజు, ఈఈ వై భీమా ధన రావు, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర, ఎలక్ట్రో మెకానికల్ విభాగం సీనియర్ మేనేజర్ మణికంఠ పాల్గొన్నారు. ప్రాజెక్ట్‌లో ఈ స్టే రింగ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.
ఒక్కో స్టే రింగ్ 4 విభాగాలుగా ఉంటుంది. దీని బరువు 136 మెట్రిక్ టన్నులు. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే కప్లాన్ టర్బైన్లు సమర్ధవంతంగా పనిచేయటంలో ఈ స్టే రింగ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రాజెక్ట్‌లో కీలకమైన నిర్మాణ పనులు దీని అమరిక తరువాత కొనసాగిస్తారు. ఈ సందర్భంగా ఎస్ఈ రామభద్ర రాజు మాట్లాడుతూ జల విద్యుత్ కేంద్రంలో స్టే రింగ్‌ల ఏర్పాటు తరువాతే టర్బైన్ల అమరిక చేపడతారని తెలిపారు. ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం కాకుండా ఉండేందుకు అన్ని పనులు సమాంతరంగా చేస్తున్నట్లు తెలిపారు. నిర్దేశించిన సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర తెలిపారు.