Stagnant Irrigation of Kommamuru Canal :గుంటూరు జిల్లాలో ఏటా మూడు పంటలతో కళకళలాడిన కొమ్మమూరు కెనాల్ ఆయకట్టులోని పొలాలు నేడు సాగునీరందక బీడు భూముల్ని తలపిస్తున్నాయి. నీటి ఎద్దడితో అనేక మంది రైతులు సాగుకు దూరం కాగా ఆశ చావక రబీలో వరి వేసిన అన్నదాతలు చేతికందివచ్చిన పంటను కాపాడుకునేందుకు అష్టాకష్టాలు పడుతున్నారు. కొమ్మమూరు కెనాల్‌కు ఫిబ్రవరిలోనే నీటి సరఫరా నిలిచిపోవడంతో పక్కనే ఉన్న నల్లమడ డ్రెయిన్ నుంచి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తూ పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
నీరిస్తామన్నారని వరి వేసిన అన్నదాతలు- పంట కోతకొచ్చే వేళ చేతులెత్తిన అధికారులు
Guntur District :కరవు అంటే వినడమే కానీ ఎన్నడూ చూడని గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతపు రైతులు పాలకులు, అధికారుల ముందుచూపు లేమితో దుర్భిక్షంతో అల్లాడుతున్నారు. గుంటూరు జిల్లాలో ఖరీఫ్, రబీ పంటలకు ఎక్కువగా సాగర్ కాలువ నుంచి సాగునీరు అందుతోంది. నీటి సమస్య లేనందున అన్నదాతలు మూడో పంటను కూడా వేస్తుంటారు. అలాంటిది ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పాటు సాగర్ నుంచి సాగునీరు సరఫరా లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకుమాను మండలం అప్పాపురం మీదుగా ప్రవహించే కొమ్మమూరు కాలువకు నీటి సరఫరా ఫిబ్రవరిలోనే నిలిచిపోయింది. గతంలో ఎన్నడూ ఇలా నిలిపివేసిన దాఖలాలు లేవని మార్చి, ఏప్రిల్ నెలలోనూ సరఫరా కొనసాగేదని రైతులు తెలిపారు. నెలన్నర ముందుగానే నిలిపివేయడంతో రబీలో వేసిన వరి పంట నీరు లేక ఎండిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.