Srivari Brahmotsavam Start Today :తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను గతం కంటే మిన్నగా, వైభవంగా నిర్వహిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు. దేవస్థానంలోని స్థానిక అన్నమయ్య భవనంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి గురువారం విలేకరులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను, టికెట్లు, భక్తులకు కల్పించిన సౌకర్యాల గురించి మాట్లాడారు.
టీటీడీ ఈవో చెప్పిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమాచారం :
- ఇవాళ్టి (శుక్రవారం) నుంచి ఈ నెల 12 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
- నేడు శ్రీవారికి ఏపీ సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
- అనంతరం టీటీడీ 2025 క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరిస్తారు.
- ఈ నెల 5వ తేదీ నుంచి తిరుపతి, తిరుమలలోని టీటీడీ విక్రయ కేంద్రాల్లో వాటిని అందుబాటులో ఉంచుతారు.
- బ్రహ్మోత్సవాల సందర్భంగా 1.32 లక్షల మందికి రూ.300 దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు.
- రోజూ ఎస్ఎస్డీ టోకెన్లు 24,000 కేటాయించనున్నారు.
- శ్రీవాణి దర్శన టికెట్ల కరెంట్ బుకింగ్ ఈనెల 4,8వ తేదీన రద్దు చేశారు. మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉంటాయి.
- తిరుమలలో 40 వేల మంది భక్తులు బసచేసే అవకాశం ఉంది.
- యాత్రికుల సౌకర్యాల సముదాయా(పీఏసీ)లు 1,2,3,4తో కలిపి 28 హాళ్లు, 670 వరకు లాకర్లు ఉన్నాయి. వీటిలో మరో 20 వేల మంది భక్తులు బస చేయవచ్చు.
- మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి ఒంటి గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తారు.
- రోజూ లక్ష మందికి పాలు అందిస్తాము.
- అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలు వద్ద స్విమ్స్ వైద్యులతో కార్డియాక్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు.
- గరుడసేవ రోజున 24 గంటలూ ఘాట్‌రోడ్లను తెరచి ఉంచుతాం.
- ఆర్టీసీ బస్సుల్లో మూడు వేల ట్రిప్పుల ద్వారా మూడు లక్షల మందిని తిరుమలకు తరలిస్తారు.
- శ్రీవారి చక్రస్నానం రోజున భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, బోట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు.