Spurious Seeds in Telangana : ప్రపంచంలో అత్యంత కష్టతరమైన వృత్తుల పేర్లు చెప్పమంటే అందులో అగ్రభాగంలో ఉండేది వ్యవసాయం. కారణం ప్రతి దశలోనూ సవాళ్లు పలకరించడమే. వర్షాలు సరిగా కురవడం నుంచి మొదలు పండిన పంటకు గిట్టుబాటు ధర రావడం వరకు అడుగడుగునా కష్టాలే. ఇన్ని ఇబ్బందులు చాలవు అన్నట్లు తెలంగాణలో నకిలీ విత్తన వ్యాపారులు రైతులను మరిన్ని కష్టాలపాలు చేస్తున్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో కూడా నకిలీ విత్తనాలను మార్కెట్‌లోకి వదిలేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నకిలీ విత్తన వ్యాపారుల ఆగడాలను అడ్డుకునేందుకు విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు చేసేందుకు యోచిస్తోంది.
Telangana Govt focus on Counterfeit Seeds :నకిలీ విత్తనాల(Fake Seeds) వల్ల రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాటితే మొలకెత్తవు. మొలకెత్తినా పైరు ఎదగదు. ఎదిగినా బలంగా ఉండదు. త్వరగా చచ్చిపోతుంది. నిలిచినా చీడపీడలకు తట్టుకోలేదు. విత్తనాలు నాటిన తర్వాత మొలకెత్తిందీ లేనిదీ పది రోజులకు గాని తెలియదు. విత్తనాలు నకిలీవి అని తెలియవు. ఆ తర్వాత చూస్తే ఫలితం షరామామూలే. రాష్ట్రంలో నకిలీ విత్తనాల వల్ల మోసపోయిన పలువురు అన్నదాతలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
Fake Cotton Seeds In Telangana : తెలంగాణ రైతుపై "నకిలీ విత్తనం" పడగ
నకిలీ విత్తనాల కోసం మోసగాళ్లు ప్రధానంగా పత్తి(Fake Cotton Seeds), మిరప, మొక్కజొన్న వంటి వాటినే ఎంచుకుంటున్నారు. ఈ విత్తనాలకే వేలల్లో ధర ఉండడంతో అక్రమార్కులు వీటిని యథేచ్ఛగా విక్రయించి లక్షల్లో సంపాదిస్తుంటారు. జిన్నింగ్ మిల్లుల నుంచి తెచ్చిన పత్తి గింజలు, మార్కెట్‌లో కొన్ని మక్కలను, పొడి పరిశ్రమ నుంచి తెచ్చిన మిరప గింజలు, ఇతరత్రా సాధారణ పద్ధతుల్లో సేకరించిన కూరగాయల గింజలకు విత్తన శుద్ధి మందును పట్టించి అందమైన కవర్లు, డబ్బాల్లో నింపి ప్రముఖ కంపెనీల పేరిట లేదా నూతన విత్తనాలు అని ప్రతి పంటకు రైతులకు అంటగడతున్నారు. ఇవి రైతులకు చేరి దిగుబడి రాక నష్టపోతున్నారు.
ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనాలి : నకిలీ విత్తనాల విషయంలో రైతులు అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొని బిల్లులు తీసుకోవాలి. గ్రామాల్లో జీరో కింద ఎలాంటివి కొనుగోలు చేయరాదు. విత్తనాల బస్తాపై గాని, ప్యాకెట్లపై గాని విత్తన వివరాలు లేబుల్ రూపంలో లేకుంటే అవి నకిలీవి అని గుర్తించాలి. నకిలీ విత్తనాల ప్యాకెట్‌పై లాట్ నంబరు ఉండదు. నకిలీ విత్తనాలు అని అనుమానం వస్తే వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలి.