తెలంగాణ

telangana

ETV Bharat / state

'భూ భారతి'తో మీ భూములు సేఫ్! - ఎక్కడినుంచైనా ఈజీగా ఆ వివరాలు చూసుకోవచ్చు - TELANGANA BHU BHARATI 2024

భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా 'భూ భారతి'కి సర్కార్ శ్రీకారం - 'భూ భారతి'లో కీలక అంశాలను పొందుపర్చిన ప్రభుత్వం - ఎవరైనా, ఎక్కడి నుంచైనా భూముల సమాచారం తెలుసుకునేలా కొత్త వ్యవస్థలో ఏర్పాట్లు

bhu bharati 2024
bhu bharati 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2024, 9:03 AM IST

Telangana Bhu Bharati : భూములకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ సర్కార్‌ 'భూ భారతి'కి శ్రీకారం చుట్టింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొత్త ఆర్వోఆర్ బిల్లులో కీలక అంశాలు ఉన్నాయి. కొత్త చట్టం పార్ట్-బీలోని 18 లక్షల ఎకరాల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని, ఆబాదీ, గ్రామ కంఠం భూములకూ సంపూర్ణ హక్కులు కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది. తప్పులు జరిగితే అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. ధరణిలోని 33 మాడ్యూల్స్‌ పరిష్కరించలేని సమస్యల్ని, భూ భారతిలో 6 మాడ్యూల్స్‌తోనే సరి చేస్తామని సర్కారు స్పష్టం చేసింది.

బీఆర్​ఎస్ సర్కార్‌ తెచ్చిన ఆర్వోఆర్‌ చట్టం-2020లో అనేక లోపాలు ఉన్నాయని చెబుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆ సమస్యల పరిష్కారానికే 'భూ భారతి'ని తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. ధరణి వల్ల ఉత్పన్నమైన అనేక ఇబ్బందులకు కొత్తగా తేనున్న చట్టంలో పరిష్కారం చూపించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ఎంజాయ్‌మెంట్ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ఆబాదీ, గ్రామకంఠం భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామన్నారు. మ్యుటేషన్‌లో ఏవైనా పొరపాటు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేశారు. వారసత్వం, వంశపారంపర్య భూములు, సేల్ డీడ్ కాక, మొత్తం 14 రకాల భూమి హక్కులపై మ్యుటేషన్ చేసే అధికారం ఆర్​డీవోకు ఇచ్చారు.

ప్రభుత్వ ఆస్తుల్ని తారుమారు చేసే అధికారులను శిక్షించే అధికారం : 2020 నవంబరు 10 వరకు ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన 9.24 లక్షల సాదా బైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని సర్కారు పేర్కొంది. దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో, మన రాష్ట్రంలో భూములకు భూ ఆధార్ నంబర్ కేటాయిస్తామంది. 2014కు ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ, జమాబందీ ఎలా ఉండేదో, ఇకపై అదే విధంగా కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. బీఆర్​ఎస్​ పాలనలో భ్రష్టుపట్టిన రెవెన్యూ వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమిస్తామని సర్కారు తెలిపింది. భూ వివాదాల అర్జీలకు, అప్పీళ్ల కోసం లాండ్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేశారు. అవసరాన్ని, ప్రాంతాన్ని బట్టి మరిన్ని పెంచనున్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని, రికార్డుల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే సీసీఎల్​ఏ ద్వారా రివిజన్ చేసుకునే ప్రత్యామ్నాయాన్ని చట్టంలో పొందుపరిచారు. ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులను శిక్షించే అధికారాన్ని కొత్త చట్టంలో కల్పించారు.

ఎక్కడినుంచైనా భూముల సమాచారం : భూ భారతి ఆర్వోఆర్‌ బిల్లు-2024లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. గతంలో మాన్యువల్‌ పహాణీలో 32 కాలమ్స్‌ ఉండగా, ధరణిలో ఒకే కాలమ్‌కు కుదించారు. భూ భారతిలో 11 కాలమ్స్‌ తేనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త వ్యవస్థలో ఎవరైనా, ఎక్కడి నుంచైనా భూముల సమాచారం తెలుసుకోవచ్చు. అన్యాక్రాంతం అవుతున్న భూముల వివరాలను సర్కారు దృష్టికి తేవచ్చు. భూ-భారతిలో దరఖాస్తు చేసుకున్న రైతుల మొబైల్ నెంబర్లకే అప్‌డేట్స్ వెళ్లే సౌకర్యాన్ని కల్పించారు. ధరణి ద్వారా అన్యాక్రాంతమైన భూముల వివరాలను భూ భారతి ద్వారా బయట పెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఇందుకోసం 2014కు ముందు సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ భూముల వివరాలను సరి చూస్తామన్నారు. సర్కారు భూములను ఆక్రమించిన వారు, ఎంతటి వారైనా వదిలేది లేదని పొంగులేటి స్పష్టం చేశారు.

'ధరణి పోర్టల్​లో ఆస్తుల వివరాలు తెలుసుకునే పరిస్థితి లేదు - కానీ భూ భారతిలో వివరాలు అన్నీ ఉంచుతాం'

ABOUT THE AUTHOR

...view details