AP Police Negligence in Praja Galam Sabha: ప్రజాగళం సభలో రాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం వల్ల, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌లు ప్రధాని నరేంద్రమోదీకి జ్ఞాపికలు బహుకరించలేకపోయారు. శాలువ కప్పి, పుష్ప గుఛ్చమిచ్చి సత్కరించుకోలేకపోయారు. ప్రధాని సభ వేదికపైకి వచ్చిన వెంటనే ఆయన్ను సత్కరించి జ్ఞాపికలు ఇవ్వాలని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు భావించగా ఎస్పీజీ సిబ్బంది సభ ముగిసిన అనంతరం జ్ఞాపికలు అందివ్వాలని సూచించారు. ప్రధానికి చంద్రబాబు వేంకటేశ్వర స్వామివారి ప్రతిమ, పవన్‌కల్యాణ్ చందనం మాల ఇవ్వాలనుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆ జ్ఞాపికలను తీసుకెళ్తుండగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన్ను అడ్డగించారు. సత్యప్రసాద్‌ను లోపలికి అనుమతించాలని ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది చెప్పినా సరే, వారు ఆ ఆదేశాలు ఖాతరుచేయలేదు. జిల్లా ఎస్పీ చెబితేనే అనుమతిస్తామని మొండిగా వాదించారు. ఎంత సేపు వాదించినా రాష్ట్ర పోలీసులు ఆయన్ను అనుమతించకపోవటంతో, జ్ఞాపికలను చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల వద్దకు ఆయన చేరవేయలేకపోయారు.
ప్రధానమంత్రి పాల్గొన్న సభలో జరిగిన పలు సంఘటనలు, రాష్ట్ర పోలీసుల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రధాన వేదికకు సమీపంగా ఉన్న గ్యాలరీలోనే వాటర్ బాటిల్ విసరడం, తోపులాటలు వంటి ఘటనలు చోటుచేసుకున్నా, పోలీసులు పట్టించుకోలేదు. వీఐపీ గ్యాలరీ ప్రవేశమార్గంలో తొక్కిసలాట జరగడం, వీవీఐపీ, మీడియా గ్యాలరీల్లోకి కార్యకర్తలు చొచ్చుకు వచ్చి, తోపులాటకు దిగినా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ప్రజలు, వీఐపీలు, వీవీఐపీలకు ప్రత్యేకమార్గాలు ఉన్నా పోలీసులు వారికి సరైన దిశానిర్దేశం చేయకుండా అందరినీ వీఐపీ ప్రవేశమార్గం వద్దకు పంపారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ట్రాఫిక్ చిక్కుకుని, సభకు రాకుండానే వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది.
అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ హాజరైన సభలోనే పోలీసులు విధి నిర్వహణలో విఫలమయ్యారు. ప్రధాని రావటానికి ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీజీ బృందాలు,సభ నిర్వహణలో బందోబస్తు పరమైన లోపాలు ఉన్నాయని గుర్తించి అప్రమత్తం చేశారు. అప్పుడు పోలీసులు స్పందించలేదు. లైట్ల కోసం ఏర్పాటుచేసి టవర్ స్టాండ్ పైకి కొందరు కార్యకర్తలు ప్రమాదకరంగా ఎక్కారు. అది గమనించిన ప్రధాని మోదీ స్వయంగా వారిని ఉద్దేశించి, వెంటనే కిందకు దిగండంటూ వారించినా, పోలీసులు చర్యలు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తు దేశ ప్రధాని పోలీసులను అప్రమత్తం చేసినా, వారు స్పందించలేదు. దీన్నిబట్టి వారు విధి నిర్వహణను ఎంత తేలిగ్గా తీసుకున్నారో అర్థమవుతోంది.
ప్రజాగళంలో సభలో పోలీసుల వైఫల్యం - ప్రధాని ప్రసంగానికి పలుమార్లు ఆటంకం