Story on Komaram Bheem Colony Govt School Teacher in Adilabad : 'కుమురం భీం కాలనీ ప్రభుత్వ పాఠశాల' అని నాలుగక్షరాలతో సాదాసీదాగా రాసి ఉన్న ప్రహరీని చూస్తే ఇదేంటీ? అని అనుకోవచ్చు. కానీ ఇందులో 83 మంది విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందంటే నమ్ముతారా? అందుకు కొత్తూరి శ్రీలత అనే ఈ పంతులమ్మ కారణమంటే నమ్మగలరా? కానీ మీరు విన్నది నిజమే. ఆదిలాబాద్‌లోని కుమురం భీం కాలనీలో మూతపడిన పాఠశాలను 2019లో తిరిగి తెరిపించారీ టీచరమ్మ.
డ్రాపవుట్లుగా ఉన్న 40 మంది పిల్లలను చేరదీసి బడిబాట పట్టించారు ఈ టీచరమ్మ. బడికి భవనం లేనందున సొంత డబ్బులతో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని, ఐదేళ్లుగా పాఠాలు చెబుతున్నారు. ఆమె ప్రయత్నం వల్ల కాలనీ వాసుల్లో మార్పు వచ్చింది. విద్యార్థుల సంఖ్య 83 మందికి చేరింది. ఆటపాటల మధ్య పేద విద్యార్థుల చదువు ఆనందంగా సాగుతోంది. 2010లో కుమురం భీం కాలనీకి ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది.
2012లో ఆక్రమణల తొలగింపులో భాగంగా ఈ కాలనీని అధికారులు ఖాళీ చేయించారు. ఫలితంగా పాఠశాల మూతపడింది. అయితే విద్యాశాఖ రికార్డుల్లో బడి పేరుండటంతో 2018లో అక్కడికి శ్రీలత అనే టీచర్ బదిలీ అయ్యారు. తీరా అక్కడికెళ్లి చూస్తే బడీ విద్యార్థులు ఎవరూ లేరు. విషయం అప్పటి కలెక్టర్ దివ్యదేవరాజన్ దృష్టికి వెళ్లడంతో శ్రీలతను ఆమె ముందు పనిచేసిన సాంగిడికి మళ్లీ డిప్యూటేషన్‌పై పంచించారు. ఇక్కడితో కథ పరిసమాప్తం అయ్యిందని అందరూ అన్నారు.
40 మంది డ్రాపవుట్ల విద్యార్థుల కోసం :శ్రీలత టీచర్ డిప్యూటేషన్‌పై వెళ్లినప్పటికీ ఆమె దృష్టి అంతా కుమురం భీం కాలనీ చుట్టే తిరగటం ప్రారంభమైంది. ఈలోగా నిర్వాసితులైన పేదలకు మరో చోట ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించగా, కొత్త కాలనీ ఏర్పడింది. కానీ అందులో బడి ప్రస్థావనే లేదు. వేసవి సెలవుల్లో శ్రీలత తన భర్త అశోక్‌తో కలిసి వెళ్లి కాలనీలో పరిశీలించగా, 40 మంది పేద విద్యార్థులు డ్రాపవుట్లగా మారినట్లు తేలింది. వారికెలాగైనా చదువు చెప్పాలని భావించిన పంతులమ్మ, సాంగిడిలో డిప్యూటేషన్ రద్దు చేసుకొని కుమురం భీం కాలనీకి వచ్చేసింది.