Special Story On Folk Singer Jhansi : వినసొంపైన గానంతో ప్రకృతి సైతం పరవశించేలా పాట పాడుతున్న ఈ యువతికి చిన్ననాటి నుంచే పాటలు పాడటమంటే చాలా ఇష్టం. ఉద్యమ గీతాలే ఊపిరిగా జానపద గేయాలే జనాలను ఆకర్షిస్తాయనే నమ్మకంతో పల్లె పాటలు, ఉద్యమ గీతాలపై ప్రేమను పెంచుకుంది. అంతేకాదు వ్యవసాయం, చదువులోనూ తనదైన ప్రతిభ చాటుతూ సంగీతప్రియుల మన్ననలు పొందుతోంది.
మగవారికి ఏమాత్రం తీసిపోకుండా ట్రాక్టర్‌తో వరిమడిని చదును చేస్తున్న ఈ యువతి పేరు ఝాన్సీ. సూర్యాపేట జిల్లాలోని కోమటికుంట గ్రామానికి చెందిన వ్యవసాయం కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు సైదులు, హేమలత. వీరికి నలుగురు సంతానం. అందులో ముగ్గురు ఆడపిల్లలే వారిలో ఝాన్సీ చిన్న కుమార్తె. వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తూ పిల్లలను చదివిస్తున్నారు.
తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా :చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కష్టాన్ని చూసిన ఝాన్సీ వారికి చేదోడు వాదోడుగా నిలవాలనుకుంది. ప్రతిరోజు పొలానికి వెళ్తూ పనుల్లో సాయం చేస్తోంది. మందుల పిచికారి నుంచి మొదలుకొని ట్రాక్టర్‌తో దున్నడం వంటి పనులతో అమ్మనాన్నలకు ఆసరాగా నిలుస్తోంది.
పాటలపై మక్కువ పెంచుకుని :అక్షరాలు దిద్దుతున్నప్పటి నుంచే పాటలు పాడటం అంటే ఝాన్సీకి మహాఇష్టం. అలా మూడో తరగతి నుంచే పాటలు పాడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. పాఠశాల, కళాశాల జరిగే కార్యక్రమాల్లో వినసొంపైన గానంతో సంగీత ప్రియులను మెప్పించి బహుమతులు అందుకుంది. జానపదాలతో పాటు ప్రజలను చైతన్యపరిచే పాటలు పాడటమే తనకిష్టమని చెబుతోంది ఝాన్సీ.
చదవులోనూ ప్రతిభ చూపుతున్న ఝాన్సీ :పాటలు, వ్యవసాయం పనుల్లో పడి చదువును ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు ఝాన్సీ. డిగ్రీలో 10/10 ఉత్తీర్ణత సాధించి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ చేస్తోంది. భవిష్యత్తులో పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమౌతున్నట్లు చెబుతోంది. ఆడపిల్లలు చదువుతో పాటు అన్నిరంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలని సూచిస్తోందీ లేడీ సింగర్.