Dr. Kurella Vithalacharya Got Padma Sri Award : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ(Padma Sri) పురస్కారానికి ఎంపికైన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను ఊరికే ఆ పురస్కారం వరించలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఈయన విద్యావ్యాప్తిలో చేసిన కృషి అసమానం. తెలుగు ఉపాధ్యాయుడిగా, రచయితగా పని చేసిన ఆయన తన ఇంట్లో 5 వేల సొంత పుస్తకాలతో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ప్రజలు కూడా తోడ్పాటు అందించడంతో ప్రస్తుతం ఇక్కడ 2 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రంథాలయంలోని పుస్తకాల సహాయంతో పరిశోధనలు చేసి 17 మంది డాక్టరేట్ పట్టా పొందడం విశేషం.
పింఛన్ డబ్బులతోనే గ్రంథాలయం ఏర్పాటు :ఇటీవల ఆ ఇంటిని కూల్చి దాతల సహకారంతో 50 లక్షల రూపాయలతో నిర్మించిన భవనంలో గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. కూరెళ్ల విఠలాచార్య స్ఫూర్తితో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 12 గ్రంథాలయాలు ప్రారంభమయ్యాయి. ఈ కృషికే పద్మశ్రీ పురస్కారం వరించింది. కూరెళ్ల విఠలాచార్య తల్లిదండ్రులు కూరెళ్ల లక్ష్మమ్మవెంకట రాజయ్య. 1938లో జన్మించిన ఈయనకు ఐదేళ్ల ప్రాయంలోనే తండ్రి దూరమయ్యారు. తల్లి లక్ష్మమ్మ అనేక కష్టాల పడింది. ఆమె కష్టాలను చూసిన మేనమామ విఠలాచార్యను తీసుకువెళ్లి చదివించారు. అయితే చదువుతో పాటే రచనలపై కూడా ఆయన ఆసక్తి పెంచుకున్నారు ఆయన. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకుని ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.
తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డలకు 'పద్మ' పురస్కారం - శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
గొలుసుకట్టు నవలలు అనే అంశంపై పరిశోధన :సొంత గ్రామంలోనే ప్రధానోపాధ్యాయుడిగా పని చేశారు. 35 ఏళ్లు ఉపాధ్యాయుడిగా, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకుడిగా విధులు నిర్వహించారు. ఆ క్రమంలోనే తెలుగులో గొలుసుకట్టు నవలలు అనే అంశంపై పరిశోధన చేసి విఠలాచార్య 1980లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. ఒకవైపు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే రామన్నపేట పరిసర ప్రాంతాల్లో పలు సాహితీ సంస్థలను స్థాపించి యువ కవులను, రచయితలను ప్రోత్సహించారు. వారి రచనలను వెలుగులోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నప్పడు భువనగిరి మండలం వడాయిగూడెంలో అక్షరాస్యత ఉద్యమాన్ని నిర్వహించి వయోజనులకు రాత్రివేళల్లో చదువు నేర్పించారు.
కూరెళ్ల విఠలాచార్యని వరించిన పద్మశ్రీ :కూరెళ్ల విఠలాచార్య ఆ ఉద్యమాన్ని ఊరూరా వ్యాప్తి చేసేందుకు కృషి చేశారు. ఈయన అక్షరాస్యత ఉద్యమం స్ఫూర్తితో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చదువు - వెలుగు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విఠలాచార్య చేస్తున్న సమాజ సేవను అభినందించారు. చిన్నప్పడు తాను చదువుకోవడానికి సరైన వసతి లేదని పుస్తకాలు కూడా అందుబాటులో ఉండేవి కావన్నారు విఠలాచార్య. చదువుకునేందుకు తాను పడిన కష్టాలు మరెవరూ పడవద్దని తన ఇంటినే గ్రంథాలయంగా మార్చారు. 14 ఎళ్ల వయసులోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత విఠలాచార్యది. ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యవంతులుగా మార్చేందుకు చేసేందుకు ఈయన ఊరూరా గ్రంథాలయం ఉద్యమాన్ని ప్రారంభించారు.