Special Story On Brain Stroke And Major Causes And Characteristics :పక్షవాతం కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. సాధారణంగా వయసు పై బడిన వారికి వచ్చే బ్రెయిన్‌స్ట్రోక్ ప్రమాదాలు చిన్న వయసులో ఉన్న వారినీ భయపెడుతున్నాయి. మెదడులోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి వచ్చే ఇస్కీమిక్ బ్రెయిన్ స్ట్రోక్ (Ischemic Brain Stroke) కేసులు 85% వరకు నమోదవుతున్నాయి. మెదడు నాళాలు చిట్లి రక్త స్రావమయ్యే హేమరేజిక్ కేసులు (Hemorrhagic cases) మిగిలిన 15% ఉంటున్నాయి. మెదడు రక్తనాళంలో ఏర్పడే గడ్డను కరిగించే మందులను నాలుగున్నర గంటల్లోపే ఇస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. అక్టోబరు 29వ తేదీ ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్‌డే సందర్భంగా మన రాష్ట్రంలో ఈ కేసుల పరిస్థితి గురించి వివరంగా తెలుసుకుందాం!
లక్షణాలివి :
- శరీరంలో ఒకవైపు పట్టు తప్పడం.
- మాటలు తడబడటం, స్థిమితంగా లేకపోవటం, చూపు మందగించడం
- ముఖం పాలిపోవడం, కాళ్లు చేతులకు తిమ్మిర్లు.
- తీవ్ర తలనొప్పి, నిస్త్రాణంగా మారడం.
- ఈ లక్షణాలలో ఏవి కనపడినా వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది. ఈ లక్షణాలు మొదలైన నాలుగున్నర గంటల్లోపే కీలకమైన మందులను ఇవ్వగలిగితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
పక్షవాతానికి ప్రధాన కారణాలు :
- పొగ తాగడం, అతిగా మద్యం సేవించడం.
- జర్దా, గుట్కా, ఖైనీ నమలటం.
- అనారోగ్యకర అలవాట్లు.. ఉప్పు, తీపి పదార్థాలను మితిమీరి తినడం.
- సరైన వ్యాయామం లేకపోవడం.
- ఆరోగ్య పరీక్షలు సక్రమంగా చేయించుకోకపోవడం.
- కుటుంబంలో ఎవరికైనా మెదడు సంబంధిత జబ్బులు ఉండటం.
ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు : పక్షవాతానికి గురై చికిత్స పొంది ఆరోగ్యం మెరుగుపడ్డ వారిలో 30% మంది వరకు తిరిగి బాధితులవుతుండటం గమనార్హం. వైద్యుల సూచనల మేరకు మందులు వాడకపోవడం, సలహాలు పాటించకపోవడంవంటి ప్రధాన కారణాలతో వారు మంచాలకే పరిమితమవుతున్నారు. 2014లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు కింద హెమరేజిక్, ఇస్కీమిక్ బ్రెయిన్‌స్ట్రోక్ కేసులు 9,564 నమోదు అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 15 వేల వరకు కేసులు నమోదు అయ్యాయి. అవే కాకుండా నేరుగా హస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది.