Special Status Sadhana Samithi Leaders Allegations : ప్రత్యేక హోదా, పోలవరం, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ ఇలా అన్నింట్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఏపీ ప్రత్యేక హోదా - విభజన హామీల సాధన సమితి నేతలు ఆరోపించారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, పి.వి మల్లికార్జునరావు, లింగంశెట్టి ఈశ్వరరావు, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
25 ఎంపీ సీట్ల కోసం ఉత్తర భారత జనతా పార్టీ: రాష్ట్రంలో చిలకలూరిపేట సభలో రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావించని ప్రధాని, అరాచక పాలన చేస్తున్న సీఎం జగన్ పై ఒక్క విమర్శ చేయలేదని చలసాని శ్రీనివాస్ ధ్వజమెత్తారు. మంత్రుల అక్రమాల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ జగన్ అవినీతి గురించి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కడుపులో కత్తులు పెట్టుకుని తెలుగుదేశం, జనసేనతో పొత్తులు పెట్టుకున్న ఉత్తర భారత జనతా పార్టీ రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు గెలిచేందుకు కుట్ర పన్నిందని చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. దొడ్డిదారిలో అధికారంలోకి రావాలనుకుంటున్న ఉత్తర భారత జనతా పార్టీని రాష్ట్ర ప్రజలంతా ఓడించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి తీరని అన్యాయం: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ పార్టీలను భయపెట్టి వారితో ప్రత్యక్షంగా, పరోక్షంగా పొత్తులతో పెట్టుకుని ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని సాధన సమితి నేత పి.వి. మల్లిఖార్జునరావు పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హోదా - విభజన హామీల సాధన సమితి యాత్ర చేపట్టనున్నట్లు నేతలు తెలిపారు.