తెలంగాణ

telangana

ETV Bharat / state

మనసు దోచుకుంటున్న సియోల్​ నగరం - పర్యాటకులను ఆకట్టుకునేలా షాపింగ్ మాల్స్ , ఫుడ్‌స్ట్రీట్‌లు - ATTRACTING SEOUL IN SOUTH KOREA

పర్యాటకులను ఆకట్టుకుంటున్న దక్షిణకొరియా రాజధాని సియోల్‌ - ఆధునికతతో పాటు సాంస్కృతిక వారసత్వానికి అద్దంపడుతోన్నసియోల్‌ - నోరూరించే కొరియన్‌ వంటకాలతోపాటు ఆకట్టుకుంటున్న షాపింగ్, ఫుడ్‌స్ట్రీట్‌లు

Seoul attractions places
Seoul Attractions Places in South Korea (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2024, 8:31 PM IST

Seoul Attractions Places in South Korea : ఆధునికతతోపాటు చారిత్రక, సాంస్కృతిక హంగులకు దక్షిణ కొరియా రాజధాని సియోల్ పెట్టింది పేరు. అక్కడ అడుగడుగునా ఆకాశహర్మ్యాలు, అందాల వీధులు, ఆహ్లాదకర నదీ తీరాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫుడ్‌స్ట్రీట్‌లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా నైట్‌స్ట్రీట్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు అందరి మనసు దోచుకుంటాయి. సియోల్ ఎన్నో అద్భుతాల సమాహారం. సియోల్‌లో రాత్రివేళ అక్కడి వీధుల్లో సేదతీరడం ఓ ప్రత్యేక అనుభవం. వెలుగులు జిలుగులతో పాటు రుచికరమైన స్ట్రీట్‌ ఫుడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తాయి.

అక్కడి కొన్ని ప్రసిద్ధ నైట్‌స్ట్రీట్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మ్యాంగ్‌డాంగ్ అనే ప్రాంతం రాత్రివేళల్లో చాలా రద్దీగా ఉంటుంది. స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాళ్లు సహా ఫ్యాషన్, బ్యూటీ దుకాణాలు తెరిచి ఉంటాయి. రాత్రి షాపింగ్‌తో పాటు స్ట్రీట్‌ఫుడ్స్‌లో రుచికరమైన ప్రత్యేక ఆహారాలను ఆస్వాదించవచ్చు. కూరగాయలతో చేసిన రైస్‌కేక్‌లను, కందిపప్పు, మసాలాలతో కలిపి చేసే వంటకం ఇక్కడ ప్రత్యేకం. పంచదార, తేనె, సిసెల్‌ నట్లతో తయారు చేసిన స్వీట్‌ పాన్‌కేక్‌, స్పైసీ రైస్ కేకులు, ఒడెంగే అనే ఫిష్ కేకులు ఇలా భిన్నమైన రుచికరమైన ఫుడ్స్ అందరినీ నోరూరిస్తాయి. సియోల్‌లో మరో ప్రముఖ స్ట్రీట్ మార్కెట్ అయిన డాంగ్డేమన్, ఫ్యాషన్ మాల్స్‌కు ప్రసిద్ధి.

జిగేల్‌మనే కాంతుల్లో వైన్స్ :ఇక్కడి వీధి స్టాళ్లల్లో వస్త్రాలు, అలంకార, మేకప్, ఫ్యాషన్‌ వస్తువులు తక్కువ ధరల్లో దొరుకుతాయి. స్ట్రీట్‌ఫుడ్‌కు పేరుపొందిన ఆ ప్రాంతంలో లైవ్ సంగీత ప్రదర్శనలు ఆకట్టుకుంటాయి. యువత, కళాకారులు, నైట్‌ లైఫ్‌తో హోన్దే ప్రాంతం పర్యాటకులు, స్థానికుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. రాత్రివేళ వీధుల్లో మ్యూజిక్‌ బ్యాండ్లు, డాన్స్ ప్రదర్శనలు ఉర్రూతలూగిస్తాయి. గిమ్‌బాప్, చీజ్‌ఫ్రైస్ వంటి స్ట్రీట్ ఫుడ్స్ నోరూరిస్తాయి. సియోల్‌లో మరో ముఖ్యమైన పర్యాటక ప్రాంతం ఇటావాన్.

రాత్రివేళ జిగేల్‌మనే కాంతుల్లో వైన్స్, అంతర్జాతీయ క్యాసినోస్‌తో ఆ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ఇక్కడ విదేశీ టూరిస్టులు ఎక్కువగా కనిపిస్తారు. పబ్బులు, క్లబ్బులు, వివిధ రకాల రెస్టారెంట్లతో ఆ ప్రాంతం కిటకిటలాడుతుంది. సియోల్‌లో పాత, పెద్ద మార్కెట్లలో గ్వాంగ్‌జాంగ్ అనే ప్రాంతం ప్రసిద్ధి. ఇక్కడ బింబింబాప్, బోసామ్, బింజీ ముఖ్యంగా బుచిమ్‌గేగా అని స్థానికులు పిలిచే కొరియన్ పాన్‌కేక్‌లు రుచి చూడవచ్చు. పలు మార్కెట్లలో షాపింగ్ చేస్తూ ఫుడ్ స్ట్రీట్లలో వంటకాలు రుచి చూస్తూ పర్యాటకులు సియోల్‌ స్థానికతను పూర్తిగా ఆస్వాదిస్తారు.

కొరియన్‌ స్పోర్ట్స్‌ వర్శిటీలా - తెలంగాణలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ

రేవంత్‌ సౌత్‌ కొరియా పర్యటన - సియోల్‌లోని చుంగ్ గే చంగ్ రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధిపై ఆరా

ABOUT THE AUTHOR

...view details