Trains Cancelled in Rains : తెలంగాణలోని వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ -విజయవాడ మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విజయవాడ -సికింద్రాబాద్, గుంటూరు- సికింద్రాబాద్ మధ్య నడిచే పలు రైళ్లు రద్దయ్యయి.
Hyderabad Vijayawada Trains Cancelled : ఇప్పటి వరకు సుమారు 30 రైళ్లు రద్దు కాగా 25 రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని రైళ్లను విజయవాడ, గుంటూరు, నల్గొండ, పగిడిపల్లి మీదుగా దారి మళ్లించామని చెప్పారు రద్దైన, దారిమళ్లించి రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే శాఖ వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. ప్రయాణికుల సహాయం కోసం రైల్వేస్టేషన్లలో హెల్ప్లైన్లు నంబర్లు ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు.
Railway Track damage in Telangana : ఈ క్రమంలోనే విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌కు వెళ్లే రైళ్ల రద్దుతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి స్టేషన్లో వేచి చూడాల్సి వస్తోందని వారు అసహనం వ్యక్తం చేశారు. నల్గొండ మీదుగా హైదరాబాద్ వెళ్లేలా ప్రత్యేక రైళ్లు నడపాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్ వద్ద విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు. శనివారం అర్ధరాత్రి 2:30 గంటల నుంచి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం తాగేందుకు మంచినీరు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.