Varra Ravindra Reddy Admits To Truth Matter Of indecent Posts : రాష్ట్రంలో కీలక నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి ఎట్టకేలకు వాస్తవాలు ఒప్పుకొన్నారు. సజ్జల భార్గవ్‌రెడ్డితో పాటు ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి సూచనల మేరకు తాను పోస్టులు పెట్టానని, తన పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతాలనూ వారే నిర్వహించారని చెప్పినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ దాటవేత ధోరణిలో వ్యవహరించిన వర్రా పోలీసులు సాంకేతిక ఆధారాలు చూపించిన తర్వాత నేరాలను అంగీకరించడంతో పాటు సూత్రధారుల పేర్లను బయటపెట్టినట్లు సమాచారం. వర్రా కస్టడీ నివేదికను నేడు పోలీసులు కడప కోర్టుకు సమర్పించే అవకాశముంది.
సీఎం చంద్రబాబు, మంత్రులు పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్‌రెడ్డి రెండు రోజుల కస్టడీ ముగిసింది. తొలిరోజు 30, రెండో రోజు 50 ప్రశ్నలను పోలీసులు సంధించారు. ఇది వరకు పోలీసుల వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలను పునరుద్ఘాటించడంతో పాటు కొత్త అంశాలను పోలీసుల ఎదుట వర్రా అంగీకరించినట్లు సమాచారం. వైఎస్సార్ జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఆయన సాంకేతిక బృందం ఎస్పీ కార్యాలయంలో వర్రాను విచారించారు. వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమాల్లో 2012 నుంచి తాను పని చేస్తున్నప్పటికీ సజ్జల భార్గవ్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నాకే జగన్ ప్రత్యర్థులపై అసభ్యకర పోస్టులు పెట్టడం ఎక్కువైందని వర్రా అంగీకరించినట్లు సమాచారం.
"తెలియదు, గుర్తులేదు.. ఐడీ, పాస్వర్డ్ మర్చిపోయా" - డీఎస్పీ అసహనం
విచారణలో పోలీసులు వర్రా రవీందర్‌రెడ్డిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. పోస్టులు పెడితే నెలకు ఎంత ఇచ్చేవారు? ‘సజ్జల భార్గవ్‌రెడ్డి ఎప్పటి నుంచి తెలుసు? ఎలా పరిచయమయ్యారు? వంటి ప్రశ్నలను డీఎస్పీ అడిగినట్లు తెలిసింది. మార్ఫింగ్ ఫొటోలు ఎవరు తయారు చేసేవారు తరచూ కంటెంట్ ఇచ్చే వ్యక్తులు ఎవరనే దానిపైనా డీఎస్పీ ప్రశ్నలు కురిపించారు. భార్గవ్‌రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి చెందిన సామాజిక మాధ్యమ కార్యకర్తలు పని చేశారని వర్రా సమాధానమిచ్చినట్లు తెలిసింది. వర్రా ఫేస్‌బుక్‌లో పెట్టిన అసభ్యకరమైన పోస్టులు అతడి ముందు ఉంచి ప్రశ్నించారు. కొన్నింటిని తానే పెట్టానని మరికొన్ని నకిలీ ఐడీలతో పెట్టారని చెప్పినట్లు తెలిసింది. వర్రాను విచారించే సమయంలో ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పాల్గొని పలు ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. సాంకేతికపరమైన ఆధారాలు ఆయన చూపించగా చివరకు వాస్తవమేనంటూ ఇందులో సూత్రధారుల వివరాలను బయట పెట్టినట్లు సమాచారం.
అవినాష్‌రెడ్డి పీఏ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత - 16 రోజులుగా పరారీలోనే
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ఆమె తల్లి విజయమ్మ, మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతపై పోస్టుల వ్యవహారాన్ని ఎస్పీ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఈ ముగ్గురి వ్యవహారంలో రాఘవరెడ్డి పాత్ర ఉందని ఒప్పుకొన్నట్లు సమాచారం. ఆయన ఇచ్చిన కంటెంట్ మేరకు తాను పోస్టులు పెట్టానని, ఇందులో వ్యక్తిగతంగా తన ప్రమేయం లేదని, కొన్నింటిని రాఘవరెడ్డే తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పోస్టు చేశారని వివరించినట్లు తెలిసింది. వర్రా రవీందర్‌రెడ్డి కేసులో ఏ-2గా సజ్జల భార్గవ్‌రెడ్డి ఉన్నారు. ఇదే కేసులో రాఘవరెడ్డిని పోలీసులు పలుమార్లు విచారించారు. మొదటి రోజు కంటే రెండో రోజు కీలక ఆధారాలను వర్రా బయటపెట్టినట్లు సమాచారం. వీటన్నింటినీ పోలీసులు రికార్డు చేశారు. వర్రా రవీందర్‌రెడ్డి రెండ్రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో రిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి కడప జైలుకు తరలించారు.
"ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో?" - అజ్ఞాతంలోకి 'పులివెందుల' వైఎస్సార్సీపీ నేతలు