Snoring Reasons And Remedies :గ్రేటర్లో చాలామందిలో గురక సమస్య వేధిస్తోంది. మధుమేహం, ఊబకాయం, కిడ్నీ(మూత్రపిండాల) సమస్యలతోపాటు మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు ఉన్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కన్పిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ‘అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా(ఓఎస్‌ఏ)’ అనేది ఈ గురకకు కారణం.
నిమ్స్ స్లీప్ ల్యాబ్‌కు నెలకు 30 మందికిపైగా బాధితులు వైద్యనిపుణులను సంప్రదిస్తున్నారు. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటే గుండె కొట్టుకునే వేగం పెరిగి నిద్రలోనే హార్ట్ ఎటాక్‌లు(గుండెపోటు) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈస్ట్రోజన్ ఎంజైమ్ కారణంగా మహిళల్లో అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా తక్కువగా ఉంటుంది.
పలు పరికరాలతో స్లీప్ స్టడీ పరీక్ష :స్లీప్ అప్నీయా సమస్యతో బాధపడే వారికి స్లీప్ స్టడీ అవసరమవుతుంది. నిమ్స్ ఆసుపత్రిలో దీని కోసం ప్రత్యేక ల్యాబ్‌ను తీర్చిదిద్దారు. గురకతో ఇబ్బందిపడుతున్న వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో అతని బహుళ శరీర వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తున్నాయో ప్రత్యేక పరికరాలతో పరిశీలించి రికార్డు చేస్తారు. మెదడు పనితీరును తెలుసుకునేందుకు ఎలెక్ట్రోఎన్సెఫలోగ్రఫీ(ఈఈజీ), గుండె పనితీరు తెలుసుకోవడం కోసం ఎలక్ట్రో కార్డియోగ్రఫీ(ఈసీజీ), కండరాల కదలికల కోసం ఎలక్ట్రోమియోగ్రామ్ తదితర పరికరాలను శరీరానికి అమర్చి ఏ మేరకు నాణ్యమైన నిద్రపోతున్నారో పరీక్షిస్తారు.