SIT TEAM TO TIRUMALA: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ చేసిన ఘటన నిగ్గు తెల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(Special Investigation Team) సిద్ధమయింది. కల్తీ నెయ్యి ఘటనలో విచారణ కోసం ప్రభుత్వం 9 మందితో సిట్‌ను ఏర్పాటు చేసింది. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో విచారణ సాగనుంది. విజయవాడ నుంచి తిరుమల చేరుకున్న సిట్ అధికారులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
కమిటీకి నేతృత్వం వహిస్తున్న గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, తిరుపతి ఏఎస్పీ వెంకట్రావు, డీఎస్పీలు సీతారామారావు, శివ నారాయణ స్వామి, సీఐలు సత్యనారాయణ, ఉమామహేశ్వర్, సూర్యనారాయణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శన అనంతరం టీటీడీ అధికారులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల వైభోవత్సవ మండపం వద్ద సహస్ర దీపాలంకరణ సేవ ఉత్సవమూర్తులను త్రిపాఠి దర్శించుకున్నారు.
అనంతరం తిరుమల నుంచి బయలు దేరిన సిట్ సభ్యులు, తిరుపతిలోని పోలీసు అతిథిగృహంలో సమావేశం అయ్యారు. లడ్డూ అపవిత్రం చేయడం వెనకదాగిన కుట్రను వెలికితీసేందుకు అనుసరించాల్సిన విధానాలు, దర్యాప్తు తీరు తెన్నులను చర్చించారు. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన సిట్ అధికారుల సమావేశం దాదాపు 2 గంటలకు పైగా సాగింది. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి పూర్తి దర్యాప్తును పర్యవేక్షించనుండగా మిగిలిన ముగ్గురు IPS అధికారుల నేతృత్వంలో మూడు బృందాలు లోతుగా దర్యాప్తు చేయనున్నాయి. విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి ఏఎస్పీ వెంకటరావులు మూడు బృందాలకు నేతృత్వం వహించనున్నారు.