ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో మూడోరోజు సిట్ విచారణ - నెయ్యి కల్తీ జరిగితే గుర్తించే పరీక్షలకు పరికరాలు ఉన్నాయా? - SIT Inquiry Adulteration Ghee Case - SIT INQUIRY ADULTERATION GHEE CASE

Adulteration Ghee Case in Tirumala : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వేగం పెంచింది. రెండు రోజుల పాటు తిరుపతిలో వరుస సమావేశాలు నిర్వహించిన సిట్‌ అధికారులు మూడో రోజు క్షేత్రస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. తిరుమలలో శ్రీవారి లడ్డూ పోటు, గిడ్డంగులు, ప్రయోగశాలల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో పాటు నెయ్యి నమూనా సేకరణ, నాణ్యత పరీక్షల అంశాలపై సిబ్బందిని విచారించారు.

SIT Inquiry Adulteration Ghee Case
SIT Inquiry Adulteration Ghee Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2024, 8:59 AM IST

SIT Investigation Laddu Adulteration Case :శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం క్షేత్రస్థాయిలో ముమ్మరం చేసింది. మూడో రోజు సిట్‌ సభ్యులు గోపీనాథ్​జెట్టి, హర్షవర్ధన్‌రాజు, వెంకట్రావు తిరుమలలోని గిడ్డంగులు, ప్రయోగశాలను పరిశీలించారు. తిరుమల గిడ్డంగుల సూపరిటెండెంట్‌ సురేష్‌ను విచారించారు. టెండర్‌ ప్రక్రియ తర్వాత గుత్తేదారు నుంచి నెయ్యి సేకరించే విధానం, ముడి సరుకులను గిడ్డంగికి తరలించాక నిల్వకు అనుసరించే విధానాలపై వివరాలు సేకరించారు. నెయ్యి సరఫరా చేసే ట్యాంకర్ల భద్రతా ప్రమాణాలు, గిడ్డంగులకు వచ్చిన తర్వాత వాహనాల వివరాల నమోదు నమూనాల సేకరణ విధానాలను ఆరా తీశారు.

టీటీడీ నెయ్యి సరఫరాపై ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ డెయిరీ నుంచి తిరుమల గోదాములకు నెయ్యి ట్యాంకర్‌ రావడానికి తిరిగి వెళ్లడానికి తీసుకునే సమయం గురించి తెలుసుకున్నారు. మూడు నెలల వ్యవధిలో ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన నెయ్యి ట్యాంకర్ల వివరాలు సేకరించారు. వాహనాల నంబర్లు, గిడ్డంగులకు వచ్చిన, తిరిగి వెళ్లిన సమయం వివరాలను రికార్డులు పరిశీలించి నమోదు చేసుకున్నారు. గిడ్డంగికి వచ్చిన టాంకర్ల నుంచి నమూనాలు సేకరించారు.

ఎలా పరీక్షలు నిర్వహిస్తారు? :ప్రయోగశాల ఇంఛార్జ్ శ్రీనివాస్‌ను సిట్‌ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. నెయ్యి నాణ్యత పరీక్షల కోసం సేకరించిన నమూనాల ఫలితాల వెల్లడికి పట్టే సమయం ప్రయోగాశాలలో నిర్వహించే పరీక్షల వివరాలపై పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అపవిత్ర పదార్థాలతో కల్తీ జరిగితే గుర్తించే స్థాయిలో పరీక్షలకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్న వాటిపైనా వివరాలు సేకరించారు.

Tirupati Laddu Ghee Controversy :ఒకవేళ నాణ్యతా ప్రమాణాలు లేని నెయ్యి సరఫరా అయినట్లు తేలితే ట్యాంకర్లను ఎన్నిరోజుల తర్వాత తిప్పి పంపుతారు అన్నది ఆరా తీశారు. తిరస్కరించిన నెయ్యిని ట్యాంకర్ మార్చి పంపితే గుర్తించే అవకాశం ఉందా అన్న అంశాలపై వివరాలు సేకరించారు. వైఎస్సార్సీపీ పాలనా కాలంలో నాణ్యత ప్రమాణాలు లేక తిప్పి పంపిన ట్యాంకర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రయోగశాలలు, గోదాముల తనిఖీలు, సిబ్బంది విచారణ అనంతరం తిరుపతి ఏఎస్పీ వెంకట్రావు బృందం తిరుమల లడ్డూపోటులో లడ్డూ తయారీ విధానాన్ని పరిశీలించింది. నిల్వ కేంద్రాల నుంచి పోటు వరకు నెయ్యి తరలించే తీరు, ఐదేళ్ల కాలంలో నెయ్యి నాణ్యత లోపించడంతో లడ్డూ తయారీలో గుర్తించిన మార్పులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలేని నెయ్యిపై అధికారులకు ఫిర్యాదు చేశారా అంటూ ఆరా తీసినట్లు తెలిసింది. నాణ్యత లోపించిన నెయ్యి వినియోగంతో లడ్డూ రుచి, వాసన కొరవడిన తీరుపై ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా స్పందించలేదని లడ్డూ పోటు కార్మికులు సిట్‌ అధికారులకు వివరించినట్లు తెలిసింది.

'కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి' - తిరుమల కల్తీ నెయ్యిపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు - SC on Tirumala Laddu Adulteration

తిరుమలగిరుల్లో ఈ జలం సేవిస్తే జ్ఞానయోగం - శేషగిరుల్లో 66 కోట్ల తీర్థాలు, ఏడు ముక్తిప్రదాలు - tirumala tirupati

ABOUT THE AUTHOR

...view details