Singer Salwaji Sandhya Five Records: కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన గాయని సల్వాజి సంధ్య స్థానిక కలెక్టర్ ఆడిటోరియంలో 6 గంటల పాటు 72 పాటలు పాడి ఐదు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆదివారం ఉదయం సల్వాజి ప్రవీణ్ మ్యూజికల్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రపంచ రికార్డు కోసం ప్రముఖ గాయని కేఎస్ చిత్ర పాడిన పాటలు పాడారు.
72 పాటలు పాడి ఐదు రికార్డులు సొంతం : జిల్లా కేంద్రానికి చెందిన సంధ్య.. ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు పాటల కార్యక్రమాన్ని ప్రారంభించి సాయంత్రం 4 గంటలకు ముగించారు. 8 మంది సంగీత వాయిద్యకారుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. భారత్ వరల్డ్ రికార్డ్, సింగర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్, కల్చరల్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డులను నెలకొల్పారని నిర్వాహకులు వరల్డ్ రికార్డ్ కో ఆర్డినేటర్ కేవీ రమణారావు తెలిపి అభినందించారు.
కరీంనగర్‌కు చెందిన సల్వాజి సంధ్య చిన్ననాటి నుంచి గాయకురాలు. తన మధురమైన గొంతుతో పాటలు పాడుతూ రాష్ట్ర స్థాయిలో మన్ననలు పొందారు. గత 15 సంవత్సరాలుగా లైవ్ ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతూ రాణిస్తున్నారు. సంధ్యకు చిన్న నాటి నుంచే నేపథ్య గాయకురాలు చిత్ర అంటే మక్కువ ఎక్కువ. గాయకురాలు చిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఆమె పాటలు పాడుతూ ప్రముఖ గాయనీగాయకుల వద్ద శెభాష్ అనిపించుకున్నారు. సల్వాజి సంధ్య భర్త సల్వాజి ప్రవీణ్ ఆర్కెస్ట్రా నిర్వహిస్తుండగా, ఆమె ఆయన సహకారంతో పాటలు పాడుతూ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.