Methanol Manufacture at Singareni :సింగరేణి సంస్థ మరో వినూత్న వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్బన్ డయాక్సైడ్ వాయువు నుంచి మిథనాల్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక ప్లాంటును సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఆధారంగా ఏర్పాటు చేస్తోంది. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు సింగరేణి సిద్ధమవుతోంది. ప్రయోగం సఫలమైతే భారీ ప్లాంట్‌ను నిర్మించేందుకు సంస్థ ఆలోచిస్తోంది.
ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి చేసిన సింగరేణి సంస్థ తాజాగా మరో రంగంలోకి అడుగుపెడుతోంది. బొగ్గును మండించగా వెలువడే కార్బన్ డైయాక్సైడ్‌తో మిథనాల్ ఉత్పత్తికి సిద్ధమైంది. ఇందుకోసం సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గును మండించగా వెలువడే వాయువు నుంచి రోజుకు 500 కేజీల పరిమాణం గల కార్బన్ డయాక్సైడ్‌ను సేకరించనుంది. దీనిని హైడ్రోజన్ వాయువుతో కుదింపు చేసి మిథనాల్ ద్రవాన్ని పొందే ప్రక్రియను థర్మల్ ప్లాంట్‌లో చేపట్టనున్నారు. ఈ ప్రయోగాత్మక ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని, డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
థర్మల్ పవర్ ప్లాంట్ అనుబంధంగా ఈ నిర్మాణం :సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు మండించగా వచ్చే కర్బన ఉద్గారాలను 99.9 శాతం వరకు వాతావరణంలో కలవకుండా నివారించడం కోసం ఈఎస్పీ (ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపిటేటర్స్) ను నెలకొల్పారు. ఈ విధానంలో చివరిగా వాతావరణంలోకి పంపించిన వాయువు నుంచి కార్బన్ డయాక్సైడ్ వాయువును స్వీకరిస్తారు. దీన్ని ఉపయోగించి మిథనాల్‌ను తయారు చేస్తారు. థర్మల్ పవర్ ప్లాంట్ చిమ్నికి అనుబంధంగా ఈ ప్రయోగాత్మక ప్లాంట్ నిర్మిస్తున్నారు. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారు చేసే ప్లాంట్‌లో ఇప్పటికే సివిల్ పనులు పూర్తయ్యాయి. వీటిలో కార్బన్ డైయాక్సైడ్‌ను సంగ్రహించే యూనిట్, హైడ్రోజన్ జనరేషన్ యూనిట్, కంప్రెషన్ యూనిట్, మిథనాల్ డిస్టిలేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
బొగ్గు పరిశ్రమ ఫించనుదారులకు కొత్త చిక్కు! - చెల్లింపులకు కొరత?