Simple Memory Tips For Students :పాఠాలను ఎప్పటికప్పుడు చదివి మంచి మార్కులు సాధించాలనుకుంటారు కొందరు స్టూడెంట్స్. కానీ పరీక్షలు రాసే సమయానికి ఒక్కోసారి ఎంత ప్రయత్నించినప్పటికీ చదివినవన్నీ గుర్తుకురావు. ఇలా మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయంతో పాటు చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే ఏవిధంగా చదవాలి అనేది ఇప్పుడు చూద్దాం.
చదివినవి ఎక్కువకాలం గుర్తుండాలంటే?
- చదివినవాటిని ఎక్కువకాలం గుర్తుంచుకోవాలంటే ముందుగా కావలసింది ఏకాగ్రత. ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఉండి చదువుకున్నవి అంత త్వరగా మర్చిపోలేరు. అలాగే ఒక అంశాన్ని ఒక నిర్ణీత సమయంలోగా నేర్చుకోవాలనే కచ్చితమైన నిబంధన పెట్టుకోవాలి. ఆ సమయంలో ఇతర అంశాల గురించి ఆలోచించకుండా పాఠ్యాంశం మీదే దృష్టిని కేంద్రీకరించాలి. ఈ విధంగా ఏకాగ్రతతో చదివినవి ఎక్కువకాలం గుర్తుంటాయి.
- ఒకేసారి ఎక్కువ లెసన్స్(పాఠాలు) చదివేయాలని ఆరాటపడకూడదు. ఇలా చదవడం వల్ల త్వరగా మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రతతో చదివి ఆ తర్వాత దాన్ని రివిజన్ చేసుకుంటే బాగా అర్థమవుతుంది. దాంతో అంత త్వరగా మర్చిపోలేరు.
- శ్రద్ధగా విన్న పాఠ్యాంశాన్ని అంత త్వరగా మర్చిపోలేరు. తోటి విద్యార్థులతో చర్చించడం, అర్థంకానివారికి చెప్పడం వల్ల చదివింది బాగా గుర్తుంటుంది. ప్రాజెక్టు వర్కులు, ప్రయోగాలు చేయడం, చదివినవాటిని వాస్తవ పరిస్థితులకు అన్వయించుకోవడం వల్ల కూడా ఎక్కువ కాలం గుర్తుండేందుకు అవకాశం ఉంది.
- శారీరక వ్యాయామం(ఎక్సర్సైజ్) చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటాం కదా? అలాగే మీ మెదడు చురుగ్గా పనిచేయాలంటే అప్పుడప్పుడూ క్రాస్‌వర్డ్స్, పజిల్స్‌ను, సుడోకులను పూరించడం, చెస్ ఆడటం లాంటివి చేయాలి. కొత్త భాష లేదా సంగీతం నేర్చుకోవడం వల్ల కూడా మెమరీ పవర్ మెరుగవుతుందంటారు.
- చదువుతున్నప్పుడు సాధారణంగా దాహం వేయడాన్ని గమనించే ఉంటారు. అందుకే వాటర్ బాటిల్‌ను మీ దగ్గర ఉంచుకోండి.