Simhachalam Giri Pradakshina 2024: సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. తొలి పావంచ దగ్గర కొబ్బరి కాయ కొట్టి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. 32 కిలోమీటర్ల ఈగిరి ప్రదక్షిణలో 10 లక్షల మంది పాల్గొంటారనే అంచనాతో ఏర్పాట్లు చేసినా, అంతకు మించి భక్తులు తరలివచ్చారు. దివ్య రథంలో సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ చేశారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి లక్ష్మీనరసింహస్వామికి నాలుగో విడత చందన సమర్పణ జరుగుతోంది.
స్వామివారిని పెద్దఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. స్వామివారి వైభవం చూసి భక్తులు తరించారు. అంచనాకు మించి భక్త జన సందోహం తరలివచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. కుటుంబ సమేతంగా గిరి ప్రదక్షిణలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆలయ అధికారుల ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. ఏటా గిరి ప్రదక్షిణకు భక్తుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. విశాఖ జిల్లా వాసులు, రాష్ట్ర ప్రజలపై సింహాచల అప్పన్న అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.
గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖలోని పలు రహదార్లు జనంతో కిక్కిరిసిపోయాయి. భక్తులు లక్షలాది మంది తరలివచ్చి గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారు. తొలి పావంచా నుంచి అడవివరం, హనుమంతవాక, అప్పుఘర్, ఇసుకతోట, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధార, ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా మళ్లీ తొలిమెట్టు వరకు మొత్తంగా 32 కిలోమీటర్ల మేర భక్తులు గిరిప్రదక్షిణ చేస్తున్నారు. గిరిప్రదక్షిణ సాగే మార్గంలో ప్రతి 500 మీటర్లకు ఒక కౌంటర్ ద్వారా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.