Shortage Of Beer Supply In Telangana : తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగానే లిక్కర్ అమ్మకాల కంటే బీర్లు విక్రయాలు అధికం. ఇక్కడ ఐటీ, ఫార్మా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉండడం, స్థిరాస్తి వ్యాపారం భారీగా వృద్ధి చెందడం, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేకాకుండా హైదరాబాద్ అంతర్జాతీయ డెస్టినేషన్ కావడంతో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగ, వ్యాపార, వృత్తి తదితర అవసరాలకు రాకపోకలు సాగించే వారి సంఖ్య కూడా భారీ ఎత్తున ఉంటుంది. దీంతో ఇక్కడ మద్యం విక్రయాలు భారీ మొత్తంలో ఉంటాయి. 2023-24 ఆర్థిక ఏడాదిలో రూ. 36,493 కోట్లు విలువైన 65.76 కోట్ల బీర్లు, 43.54 కోట్లు లిక్కర్ బాటిళ్లు మద్యం అమ్ముడు పోయింది.
లక్షలాది మంది యువత ఉద్యోగ, ఉపాధి పొందుతుండడంతో లిక్కర్ కంటే బీరు వాడకం అధికంగా ఉంటుంది. మొదటి నుంచి కూడా బీరు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. వేసవి వచ్చిందంటే లిక్కర్ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం, బీర్లు విక్రయాలు పెరగడం సర్వసాధారణం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ అధికారులు కూడా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.
బ్రీవరీలకు మూడో షిఫ్ట్‌కు అనుమతి ఇచ్చి ఉత్పత్తిని పెంచడం, డిమాండ్ అధికంగా ఉండే బ్రాండ్లు కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ ఎన్నికల నియమావళి అడ్డురావడంతో ఇసారి ఇలాంటివి ఏవీ కూడా చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు తోడు బీర్లు సరఫరా చేసే బ్రీవరీలకు ప్రతి 45 రోజులకు బిల్లులు చెల్లించే విధానం తెలంగాణాలో కొనసాగుతోంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి బ్రీవరీలకు చెల్లింపులు సక్రమంగా లేకపోవడంతో దాదాపు రెండువేల కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి చెల్లింపులు చేయాలని కొత్త ప్రభుత్వాన్ని బ్రీవరీల యాజమానులు కోరుతున్నారు. ఇప్పటికే మూడో షిప్ట్ బీరు తయారీకి చెందిన, బిల్లులు పెండింగ్ రెండు ఫైళ్లు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. మూడో షిప్ట్ బీరు ఉత్పత్తికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఇందుకు తోడు బీరు ధరలు కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాలలో ఎక్కువ ఉండడం తెలంగాణాలో తక్కువ ఉండడంతో అక్కడ నుంచి దిగుమతి చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా పోయింది. ఇలా వివిధ కారణాలతో తెలంగాణ రాష్ట్రంలో బీరు డిమాండ్‌కు తగినంత సరఫరా లేదని మద్యం దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీరు ప్రియులు ఇష్టపడే బ్రాండ్లలల్లో ప్రధానంగా బడ్వైజర్, నాక్అవుట్, రాయల్ ఛాలెంజ్, కింగ్‌ఫిషర్, కార్లస్బెర్గ్, హైవార్డ్స్, టుబర్గ్, కరోనా తదితర రకాలు ఎక్కువ అమ్ముడు పోతుంటాయని మద్యం దుకాణదారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు బ్రీవరీలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రెండు లక్షలు మేర బీర్లు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది. కానీ డిమాండ్‌ను బట్టి ఇక్కడ ఉత్పత్తిని పెంచుకోవడం, బయట నుంచి దిగుమతి చేసుకోవడం లాంటి ముందస్తు చర్యలు అబ్కారీ శాఖ తీసుకునేది.