YS Sharmila Comments on YS Jagan About Property Disputes: వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు. కన్నతల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కన్నతల్లిని కోర్టుకు ఈడ్చటం ఘర్ ఘర్ కీ కహానీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.
కంటతడి పెట్టుకున్న షర్మిల: ఇదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి సుబ్బారెడ్డి అని అన్నారు. సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారని ఆరోపించారు. రేపు సాయిరెడ్డి కూడా సుబ్బారెడ్డి లాగే మాట్లాడతారని పేర్కొన్నారు. సుబ్బారెడ్డి, సాయిరెడ్డిలో కొంచెమైనా నిజాయతీ ఉందేమో అనుకున్నానని, వారి గురించి అమ్మకు తెలియాలనే వారి పేర్లు ప్రస్తావించానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా షర్మల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీడియా సమావేశంలోనే కంటతడి పెట్టుకున్నారు.
ఇవి చూసేందుకే బతికి ఉన్నానా అని అమ్మ బాధపడుతోంది - కంటతడి పెట్టిన షర్మిల (ETV Bharat) వైఎస్సార్ స్థాపించిన వ్యాపారాలు జగన్ సొంతం కాదు: షర్మిల
సుబ్బారెడ్డి ఆలోచించి మాట్లాడాల్సింది: అందరికీ సమాన వాటా ఉండాలని వైఎస్ అనుకున్నారని, తాను చెబుతున్నది నిజమని బిడ్డలపై ప్రమాణం చేస్తానని అన్నారు. సుబ్బారెడ్డి చెప్పిన విషయాలన్నీ నిజమని ఆయన ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు ఇవ్వాలని ఉందా అని సుబ్బారెడ్డి అన్నారని గుర్తు చేశారు. అదే విధంగా ఆస్తులు నావైతే నేను కూడా జైలుకు వెళ్లాలని సుబ్బారెడ్డి అన్నారని తెలిపారు. మరి అలాంటప్పుడు ఆస్తులు భారతికి చెందినవైతే ఆమె కూడా జైలుకు వెళ్లాలి కదా ప్రశ్నించారు. గిఫ్ట్ ఇస్తానని ఎవరైనా ఎంవోయూ రాసుకుంటారా అని షర్మిల నిలదీశారు.
సుబ్బారెడ్డి ఆలోచించి మాట్లాడాల్సిందని షర్మిల అభిప్రాయపడ్డారు. ఈ గొడవలు ప్రతి ఇంట్లో ఉంటాయని అంటున్నారని, కన్నతల్లిని కోర్టుకు లాగడం ఘర్ ఘర్ కీ కహానీ ఎలా అవుతుందిని షర్మిల మండిపడ్డారు. కన్నతల్లిని కోర్టుకు లాగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. జగన్ కోసం తాను, అమ్మ చాలా కష్టపడ్డామని, 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని అన్నారు. తానేం తప్పు చేశానో చెప్పాలని వైసీపీ నేతలు, కార్యకర్తలను అడుగుతున్నానని నిలదీశారు. జగన్ కోసం రెండు ఎన్నికల్లో పాదయాత్ర చేశానన్న షర్మిల, జగన్ బాగు కోసం నేను ఎన్నో పనులు చేశానని, నా మేలు కోసం ఆయన ఏమైనా చేశారా అని ఆవేదన వ్యక్తం చేశారు.
'చిన్నప్పుడే చంపేస్తే బాగుండేది ఏమో': ఐదేళ్లపాటు ఎంవోయూ పత్రాలు నా వద్దే ఉన్నాయన్న షర్మిల, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఎంవోయూ తాను వాడుకోలేదని తెలిపారు. వైఎస్ కుటుంబం గురించి చెడ్డగా చెప్పుకుంటారనే ఎంవోయూపై మాట్లాడలేదని అన్నారు. విజయమ్మను కోర్టుకు లాగారంటే దానికి కారణం ఎవరని ప్రశ్నించిన షర్మిల, సొంత కుమారుడే తల్లిని కోర్టుకు లాగడం దారుణం కాదా అని మండిపడ్డారు. తనకు లాభం ఉందని అనుకుంటే జగన్ ఎవరినైనా వాడుకుంటారని, తనకు లాభం లేదని అనుకుంటే ఎవరినైనా అణచివేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కుమారుడిని ఎందుకు కన్నాను, చిన్నప్పుడే చంపేస్తే బాగుండేది కదా అని విజయమ్మ అనడం లేదని, ఇలాంటివి చూసేందుకేనా బతికి ఉన్నానా అని అమ్మ బాధపడుతోందని షర్మిల తెలిపారు. ఇలాంటి వ్యక్తి మీకు నాయకుడో, శాడిస్టో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆలోచించాలని షర్మిల కోరారు.
MOUపై సంతకం ఎలా చేశారు? అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? - జగన్‌కు ప్రశ్నలు సంధించిన షర్మిల