ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో వలపు వలలో చిక్కుకుంటున్న అమాయకులు - ఈ ఏడాది వేలల్లో కేసులు - sextortion traps in telangana - SEXTORTION TRAPS IN TELANGANA

Sextortion Cases Rising in Telangana : సైబర్‌ నేరగాళ్లు నేరాలు చేయడంలో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. అమాయకుల బలహీనతను ఆసరాగా చేసుకోని వలపు వలవేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. గత కొంత కాలంగా తెలంగాణాలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్న వేళ, వలపు వలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

sextortion traps in telangana
sextortion traps in telangana (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 10:35 AM IST

How to Escape From Sextortion : మనుషుల్ని అపహరించి డబ్బు వసూలు చేయడమే ఎక్స్‌టార్షన్‌. అందమైన అమ్మాయిలను ఎరవేసి, తర్వాత బెదిరించి డబ్బులు గుంజడమే సెక్స్‌టార్షన్‌. ఇలాంటి నేరాలు చేయడంలో సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. మనుషుల బలహీనతను పెట్టుబడిగా పెట్టి వారితో ఆటాడుకుంటున్నారు. వీరి భారిన పడిన వారు తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో పోలీసులను ఆశ్రయించేందుకు జంకుతున్నారు. నేరగాళ్లకు అడిగినంత ముట్టజెబుతూ సర్వం కోల్పోతున్నారు. కొద్దిమంది మాత్రం ధైర్యం పోలీసులకు చేసి ఫిర్యాదులు చేస్తున్నారు.

ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఈ తరహా 2,125 కేసులు నమోదయ్యాయి. బాధితులు ఏకంగా రూ.4,58,17,808 నష్టపోవడం గమనార్హం. సైబర్‌ నేరాలకు చిరునామాగా మారిన ఝార్ఖండ్‌లోని జామ్‌తారా, రాజస్థాన్‌లోని భరత్‌పుర్ కేంద్రాలుగా ఈ తరహా ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మొదట ఫోన్లలో పోర్న్‌సైట్లను, శృంగారపరమైన వీడియోలను వీక్షించే వారి సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు తెలుసుకుంటున్నారు. ఇలాంటి వారి వివరాలను సేకరించడానికే కొన్ని సంస్థలు ప్రత్యేకంగా పోర్న్‌ సైట్ల లాంటివి నడుపుతున్నాయి. ఒక్కసారి వీటిని చూస్తే, ఫోన్ ఐపీ చిరునామా ద్వారా సంబంధిత యజమాని సమాచారమంతా సైట్ల నిర్వాహకులకు తెలుస్తోంది. ఈ వివరాలను వీరు సైబర్‌ నేరగాళ్లకు అమ్ముకుంటారు.

వారి వద్ద సేకరించిన నంబర్లకు తొలుత అందమైన అమ్మాయి డీపీ ఉన్న ఫోన్‌ నుంచి ‘హాయ్‌’ అంటూ మెసేజ్‌ వస్తోంది. ఆ మెసేజ్​కు స్పందించలేదో ఫోన్‌ చేస్తారు. ఒక్కసారి ఫోన్‌ ఎత్తితే తీయటి మాటలతో వలవేస్తారు. కొద్దిగా పరిచయం కాగానే వీడియోకాల్‌ మాట్లాడుకుందామంటారు. అందుకు మీరు సిద్ధమవగానే మరింత రెచ్చగొట్టేందుకు వీడియో కెమెరా ముందే అమ్మాయిలు నగ్నంగా మారిపోతారు. మాటలతో మభ్యపెట్టి అవతలి వ్యక్తిని కూడా నగ్నంగా మారాలంటూ ఉసిగొలుపుతారు. వారి మాటలకు లొంగిపోయి నగ్నంగా మారితే ఇక అయిపోయినట్లే!. ఇద్దరి మధ్య జరిగే వ్యవహారమంతా రికార్డు చేస్తారు. ఆ వెంటనే బెదిరింపులకు దిగుతారు.

పెళ్లి చేసుకుంటానంటూ.. టిక్‌టాకర్‌ వలపు వల

మీ ‘నువ్వు నగ్నంగా మారిన వీడియో చిత్రాలు మా వద్ద ఉన్నాయి. వాటిని యూట్యూబ్‌లో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతారు. కావాలంటే చూడంటూ లింక్‌ పంపిస్తారు. అందులో బాధితుడి నగ్న వీడియో దర్శనమిస్తుంది. ‘ఈ వీడియోను నీ ఫేస్‌బుక్‌ మిత్రులందరికీ పంపుతామంటూ మరింత బెదిరింపులకు దిగుతారు. అలా జరక్కుండా ఉండాలంటే డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. పరువు పోతుందన్న ఉద్దేశంతో చాలామంది బాధితులు ముందు అడిగినంత డబ్బు చెల్లించుకుంటున్నారు. చాలామంది ఇక తమవల్ల కాదనుకున్న పరిస్థితుల్లోనే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పేరుకి ఎవరో మహిళ ఇదంతా నిర్వహిస్తున్నట్లు అనిపించినా దాని వెనుక పెద్ద ముఠానే ఉంటుంది.

వలపు వలకు సంబంధించి కొన్ని ఉదాహరణలు

  • ఉద్యోగ విరమణ చేసిన ఓ వైద్యుడికి సామాజిక మాధ్యమాల్లో యువతి పరిచయమైంది. కొద్ది రోజుల అనంతరం వాట్సప్‌లో వీడియోకాల్‌లో మాట్లాడటం ప్రారంభించుకున్నారు. అనంతరం ఆ యువతి నగ్నంగా కాల్స్‌ చేయడం ప్రారంభించింది. వీటిని అడ్డం పెట్టుకొని, ఆవైద్యుడి వద్ద నుంచి ఏకంగా రూ.70 లక్షలు వసూలు చేసింది. అప్పటికీ వసూళ్ల దాహం ఆగకపోవడంతో అతడు హైదరాబాద్‌ సైబర్‌ నేరాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • శిక్షణలో ఉన్న ఓ ఐపీఎస్‌ అధికారికి సెక్స్‌టార్షన్‌ నేరగాళ్లు వలవేశారు. అతని ఫోన్‌కు వాట్సప్‌ వీడియోకాల్‌ చేశారు. ఫోన్‌ ఎత్తి కొద్దిసేపు మాట్లాడారు. అప్పటి నుంచి ఆ ముఠా వేర్వేరు నంబర్ల ద్వారా కాల్స్‌ చేయడం ప్రారంభించారు. ‘మీ నగ్న ఫొటోలు ఉన్నాయని, వాటిని మీ బంధుమిత్రులకు షేర్‌ చేస్తామ’ని బెదిరించడం ప్రారంభించారు. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కాల్స్‌ అన్నీ పశ్చిమబెంగాల్‌ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
  • అతను ఓ ప్రభుత్వోద్యోగి. ఫేస్‌బుక్‌ ద్వారా ఒక మహిళ పరిచయమైంది. వారం రోజుల తర్వాత అతడి ఫోన్‌ నంబర్‌ అడిగింది. అప్పటి నుంచి వాట్సప్‌ కాల్స్‌లో నగ్నంగా మారిపోయి మాట్లాడటం మెుదలు పెట్టింది. అతను ఆమె ఉచ్చులో పడ్డాడు. కొద్దిరోజుల తర్వాత అతనికి ఆమె నుంచి వేధింపులు మొదలయ్యాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించడం ప్రారంభించింది. దాదాపు రూ.5 లక్షలు చెలించాడు. అయినప్పటికీ ఆ యువతి ఆగడాలు ఆగకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో, హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

  • మీకు గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చేటువంటి వీడియోకాల్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు.
  • మీకు తెలియని వ్యక్తులు పంపే ఫ్రెండ్‌ రిక్వెస్టులను పట్టించుకోవద్దు. ఇటువంటి వారిని వెంటనే బ్లాక్‌ చేయాలి.
  • ఇలాంటి వారు సామాజిక మాధ్యమాల ద్వారా వల వేయాలని ప్రయత్నిస్తారు. ఇక్కడ పరిచయం పెంచుకొని మీ ఫోన్‌ నంబర్‌ తీసుకుంటారు. ఆ తర్వాత మిగతా కథ అంతా నడిపిస్తారు. అందుకే సామాజిక మాధ్యమాలతో జాగ్రత్తగా ఉండాలి.
  • పోర్న్‌ సైట్లు చూసేవారికి ఈ ప్రమాదం ముప్పు ఎక్కువగా ఉంటుంది. వీరి కంప్యూటర్లు, ఫోన్లకు ఉన్న కెమెరాలను హ్యాక్‌ చేస్తున్న నేరగాళ్లు చేస్తున్నారు. వాటి ద్వారా రికార్డు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అసలీ సైట్ల జోలికే వెళ్లకపోవడం మంచిది.

ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీతో కిలేడి వలపు వల.. ఆ తర్వాత నగ్న వీడియోలతో బెదిరిస్తూ..

ABOUT THE AUTHOR

...view details