Severe Heat Waves Affect Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల నుంచే తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగానే తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని స్పష్టం చేసింది.
ఏప్రిల్ , మే నెలల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమవుతాయని వెల్లడించింది. తీవ్రమైన వేడిగాలుల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని, అంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసింది. వడగాడ్పులు తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సెల్ ఫోన్లకు హెచ్చరికల సందేశాలు పంపాలని నిర్ణయించారు.
ఎండలపై సమాచారం కోసం విపత్తు నిర్వహణా సంస్థలో 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షణ చేయనున్నట్టు ఆ సంస్థ ఎండీ ఆర్. కూర్మనాథ్ తెలిపారు.
కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తీవ్రంగానూ , అల్లూరి, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. గత ఏడాదిలోనూ గరిష్ఠంగా 48.6 డిగ్రీల మేర అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దాఖలాలు ఉన్నాయని స్పష్టం చేశారు.