పింఛన్ల పంపిణీపై వైసీపీ వికృత రాజకీయం- పథకం ప్రకారం టీడీపీపై కుట్ర SERP Orders on Pensions Distribution in AP: సామాజిక పింఛన్ల పంపిణీలో వైసీపీ వికృత రాజకీయం చేస్తోంది. ఈసీ ఆదేశాలను వక్రీకరించి లబ్ధిదారులను మభ్యపెట్టాలని చూస్తోంది. ఇంటింటికీ పింఛన్ల పంపిణీని తానే అడ్డుకుని ఆ పాపాన్ని ప్రతిపక్ష తెలుగుదేశానికి అంటగడుతోంది. పింఛన్ల పంపిణీని ఆలస్యం చేయాలని ముందే నిర్ణయించి పథకం ప్రకారం అమలుచేస్తోంది. పింఛన్ల పంపిణీని సచివాలయాలకే పరిమితం చేసి లబ్ధిదారులను 42 డిగ్రీలకు పైగా ఎండల్లో నడిపించే రాక్షస క్రీడను మొదలుపెట్టింది.
గిరిజన ప్రాంతాల్లోని పింఛనుదారుల్ని కొండలు, గుట్టలు ఎక్కించి వాగులు, వంకలు దాటించి మరింత ఇబ్బందులు పెట్టే దుర్మార్గానికి ఒడిగట్టింది. దీనంతటికీ ప్రతిపక్షాలే కారణమనేలా పింఛనుదారులందరిలో విషబీజాలు నాటడమే వైసీపీ సర్కారు ముఖ్య ఉద్దేశం. అందుకు అనుగుణంగానే శనివారం సాయంత్రం నుంచే సామాజిక మాధ్యమాల వేదికగా విషం చిమ్మే ప్రక్రియ మొదలు పెట్టింది.
రాష్ట్రంలో 15 వేలకు పైగా సచివాలయాల్లోని లక్షా 35 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరి ద్వారా సునాయాసంగా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా వైసీపీ ప్రభుత్వం కావాలనే పక్కన పెట్టి కుటిల రాజకీయం చేస్తోంది. ఇందులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ కీలక అధికారి, సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.
పింఛన్ల పంపిణీపై సెర్ప్ కీలక ఉత్తర్వులు- కోడ్ ముగిసేవరకు ఇంటింటికీ ఉండదు - SERP orders on AP pensions
ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శల్ని సీఎస్ జవహర్‌రెడ్డి మూటగట్టుకుంటున్నారు. పింఛనుదారుల్ని సచివాలయాల దగ్గరకు రప్పించి నిరీక్షించేలా చేయాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇబ్బందులు పెట్టి చంద్రబాబు కారణంగానే ఇలాంటి పరిస్థితొచ్చిందని వైసీపీ ప్రచారం చేసేలా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో సగటున 9 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా పంపిణీ చేయాల్సిన పింఛన్లు 350 నుంచి 500 వరకు ఉంటాయి. అంటే ఒక్కో సచివాలయ ఉద్యోగికి సగటున 49 వరకు వస్తాయి. వాలంటీర్లు ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి నాలుగైదు రోజుల సమయం తీసుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా రెండు, మూడు రోజుల్లోనే పంపిణీ పూర్తి చేయించవచ్చు. ఇప్పుడు వారికి పని ఒత్తిడి కూడా ఏమీ లేదు.
వాస్తవానికి వాలంటీర్లు లేకపోయినా ఇంటింటికీ పింఛను పంపిణీ చేయడానికి సరిపడా ఉద్యోగులు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్నారని ఎన్నికల సంఘానికి ప్రభుత్వ యంత్రాంగం ముందుగానే సమాచారం ఇచ్చింది. తీరా వాలంటీర్లను పక్కన పెట్టాలనే ఆదేశాలు వెలువడ్డాక అసలు వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. సచివాలయాల వద్దనే పంపిణీ చేయాలంటూ సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.
ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని తాము డిమాండు చేశాక ఆఘమేఘాలపై సచివాలయాల వద్దే ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ అనుమానిస్తోంది. ఈ ఉత్తర్వులు ఇంకా క్షేత్రస్థాయి అధికారులకు చేరకముందే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటింటికి పింఛన్లు ఇవ్వడం లేదంటూ విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
వైసీపీ కొనసాగుతున్న షాక్‌ల పర్వం- ఫ్యాన్‌ను వీడి సైకిల్ ఎక్కుతున్న నేతలు - YSRCP Leaders Join In To TDP
ఎన్నికల సంఘం పవిత్రతపైనా బురద జల్లేందుకు వైసీపీ తెగబడింది. 'రాష్ట్రంలో వాలంటీర్లంతావైసీపీ కార్యకర్తలే, మా అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలి' అని ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు గతంలోనూ, ఇటీవల ఆదేశించారు. అలాంటప్పుడు వైసీపీ కార్యకర్తలతో నగదు పంపిణీని ఎన్నికల సంఘం ఎలా అనుమతిస్తుందనే ఇంగితం కూడా వైసీపీ నేతలకు లేకపోయింది.
నగదు పంపిణీకి వాలంటీర్లను దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చేసరికి ఏకంగా రాజ్యాంగబద్ధ సంస్థపై దాడికీ వెనకాడటం లేదు. వాస్తవానికి అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలను కొనసాగించడమంటే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడమే. ఈ విషయంపై ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకుని ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఎన్నికల కోడ్ వచ్చాక ప్రభుత్వం 13వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించింది. నియమావళి అమల్లో ఉన్నా స్క్రీనింగ్ కమిటీ ఆమోదం లేకుండా తమకు అనుకూలురైన వారికి వందలు, వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించేశారు. పింఛన్ల పంపిణీ దగ్గరకు వచ్చేసరికి ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకు సెలవులు అంటూ కొర్రీలు వేస్తోంది.
సెలవు దినాలుంటే బ్యాంకుల్ని సంప్రదించి పింఛన్ల కోసం రూ.19 వందల 58 కోట్లు సిద్ధం చేయలేరా? సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీకి ముందే నగదు తీసుకుంటారు. ఇప్పుడు ఆ ముందు చూపు ఏమైంది? మూడో తేదీ నుంచి పింఛను పంపిణీ అని సెర్ప్ ముందే చెప్పడంలో ఆంతర్యమేంటి? అంటే జాప్యం చేయాలని ముందే నిర్ణయించుకుని దాన్ని అమలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి పక్కన పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీపై ఉన్నతస్థాయి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సరిపడా ఉద్యోగులు ఉన్నా, మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేయొచ్చని తెలిసినా, సీఎంఓలో అన్ని వ్యవహారాలూ తానై నడిపే కీలక అధికారి అలా చేయొద్దని చెప్పారని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.
వైసీపీ ది రాక్షస పాలన- ప్రతి ఒక్కరి మీద రెండు లక్షల అప్పుల భారం మోపారు: పురందేశ్వరి - Purandeswari Fires On CM Jagan
పింఛనుదారులందరినీ సచివాలయాలకు పిలిపించేలా ఆయన నిర్ణయం తీసుకుని సెర్ప్ ద్వారా ఉత్తర్వులు ఇప్పించారని విమర్శిస్తున్నాయి. అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాల్లో మార్పులు చేస్తే ఆచరణలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో సీఎస్‌గా ఉన్న జవహర్‌రెడ్డికి తెలియదా? తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి కదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
పింఛన్ల పంపిణీపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్ చేస్తే పదిరోజులు పడుతుందని చెప్పడం ఏమిటని ఆయన వైపు కూడా అనుమానంగా చూస్తున్నాయి. ఇంటింటికీ పింఛన్ల పంపిణీని పక్కన పెట్టి సచివాలయాలకు రావాల్సిందే అంటూ సెర్ప్ సీఈవో మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన వైసీపీ పెద్దలు చెప్పినట్లే వింటూ ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మురళీధర్‌రెడ్డి పూర్వాశ్రమంలో ఏపీఐఐసీ ద్వారా తక్కువ ధరకే భూములు కేటాయించి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని సీబీఐ నమోదు చేసిన కేసులో జగన్‌కు సహ నిందితుడు. వైసీపీ ప్రభుత్వంలో కీలక అధికారి. సెర్ప్‌లో పనిచేస్తున్న అధికారుల్లో అత్యధికులు వైసీపీతో అంటకాగుతున్నవారేనన్న ఆరోపణలున్నాయి. నిన్నమొన్నటి వరకు సీఈఓగా పనిచేసిన ఇంతియాజ్ ఇప్పుడు ఏకంగా కర్నూలు నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
పింఛనుదారులకు ఇచ్చేందుకు డబ్బులు లేక ప్రభుత్వం నాటకాలాడుతోందని ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు కాకపోతే సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేయించాలని డిమాండ్ చేశారు. సామాజిక పింఛన్లను పంచాయతీ కార్యదర్శుల ద్వారా చెల్లింపు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని సీఎస్‌ను కోరారు.