SERP Orders on Pensions Distribution: వాలంటీర్లపై వస్తున్న విమర్శలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వ పథకాల నగదు పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కనపెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోగా, ఈ మేరకు సెర్ప్ సీఈఓ డి.మురళీధరరెడ్డి అన్ని జిల్లాల అధికారులకు నాలుగు పేజీల ఉత్తర్వులను పంపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోమవారం నుంచి పింఛన్లు పంపిణీ జరిపేందుకు వీలుగా సూచనలు చేశారు. వాలంటీర్లను పింఛన్ల పంపిణీలో భాగస్వాములు చేయరాదని స్పష్టం చేశారు.
పింఛను కోసం ఏం తీసుకుని రావాలంటే: ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ ఉండబోదని తేల్చిచెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు అంతా సచివాలయం వద్ద మాత్రమే పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. పింఛన్‌దారులు తమ వెంట ఆధార్ కార్డు లేదా ఏదో ఓ గుర్తింపు కార్డును తీసుకురావాలని తెలిపారు. అదే సమయంలో పింఛన్ పాస్ పుస్తకం తీసుకురాకూడదని, దానిపై ముఖ్యమంత్రి ఫొటో ముద్రించి ఉన్నందున అది ఎన్నికల నియామవళికి విరుద్ధంగా ఉంటుందని తెలిపారు. సచివాలయం వద్ద పింఛనుదారులు ఎలాంటి తొక్కిసలాట లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అందరికీ తప్పనిసరిగా పింఛన్ అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే ఈసీపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం: అనగాని - Anagani on Pension Distribution
మిగిలిన బయోమెట్రిక్ పరికరాలు అప్పగించాలి: వాలంటీర్ల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలు ఇతర సామగ్రిని జిల్లా ఎన్నికల అధికారికి అప్పగించాలని, ఎన్ని బయోమెట్రిక్ పరికరాలు అవసరం అవుతాయో అన్నింటిని మాత్రమే సచివాలయంలో ఉంచుకుని మిగిలినవి అప్పగించాలని సెర్ప్ సీఈఓ ఆదేశించారు. ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్‌లకు ఆథరైజేషన్ లేఖ తమ లాగిన్‌లో జనరేట్ చేసి అందజేయాలని, బ్యాంకు నుంచి నగదు విత్‌డ్రా చేసే వ్యక్తులు ఈ ఆథరైజేషన్ లేఖ అసలు కాపీ దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. ఇంటికే పరిమితమైన వారి విషయంలో పింఛన్ ఏ విధంగా పంపిణీ చేయాలనే విషయమై తర్వాత ఉత్తర్వులు ఇస్తామని, సచివాలయం సిబ్బంది అందరికీ లాగిన్ ఇస్తామని, అందరికీ అన్ని పేర్లు కనిపిస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్లను పంచాయతీ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఇవ్వాలని ఏపీ పంచాయతీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు సూచించారు. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచాలన్న కేంద్ర ఎన్నికల నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.
అయితే సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈవో ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రతి సచివాలయం పరిధిలో 8 మందికిపైగా సిబ్బంది ఉన్నారని అలాగే 30 వేలకు మందికి పైగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఉన్నారని, వారి ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయవచ్చని సూచించారు. వేసవిలో వృద్దులు, వికలాంగులు, మహిళలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
పింఛన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోండి - సీఎస్‌కు లేఖరాసిన నిమ్మగడ్డ - Nimmagadda writes letter to CS