Serial Killer Involved Many Crimes in Several States Arrested in Valsad :ఒంటరి మహిళలే లక్ష్యంగా దోపిడీలు, హత్యాచారాలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తెలంగాణ సహా నాలుగైదు రాష్ట్రాల్లో అతడు హత్యలకు పాల్పడ్డాడని, వివిధ రాష్ట్రాల్లో 10కి పైగా ఇతరత్రా కేసులు ఉన్నట్లు సమాచారం. రైళ్లలో ప్రయాణిస్తూ ఎప్పటికప్పుడూ ప్రదేశాలు మారుస్తున్నట్లు గుర్తించారు. 2000 సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించి, ఓ జైలు అధికారి తోడ్పాటుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఒంటరిగా కనిపిస్తే చాలు దోపిడీ, హత్య : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హరియాణాకు చెందిన రాహుల్ జాట్ అనే వ్యక్తి పాత నేరస్థుడు. రాజస్థాన్, హరియాణా, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో చోరీలు, ఆయుధాల అక్రమ రవాణా తదితర కేసుల్లో జైలుకి వెళ్లివచ్చాడు. ఈ క్రమంలో ఒంటరిగా మహళలు కనిపిస్తే హత్యాచారాలకు పాల్పడేవాడు. ముఖ్యంగా రైళ్లలో ప్రయాణించేవారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు తెలబడేవాడు. కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లోని రైళ్లు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఈ తరహా హత్యలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. అరెస్టుకు ముందు రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలులో మహిళను దోపిడీ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.